KCR: UCC విష‌యంలో గురూజీల‌కు ఏం ప‌ని?

Nagpur: కేంద్రం అమ‌లు చేయాల‌నుకుంటున్న ఉమ్మ‌డి పౌర‌స్మ్ర‌తి (UCC) విష‌యంపై తెలంగాణ సీఎం KCR ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో BRS కార్యాల‌యాన్ని ప్రారంభించిన కేసీఆర్.. UCC గురించి ప్ర‌స్తావించారు. UCC అమ‌లుపై కేంద్రం ప్ర‌జ‌లు, వివిధ ఆధ్యాత్మిక సంస్థ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించ‌డానికి 30 రోజులు గ‌డువు ఇచ్చింది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక సంస్థ‌ల అభిప్రాయాలు దేనికి అని ప్ర‌శ్నించారు. “కేంద్రం రాజ‌కీయాల్లోకి ఆధ్యాత్మిక గురువుల‌ను లాగుతోంది. వారికి రాజ‌కీయాల‌తో ఏం ప‌ని? గురూజీలు అంటే యాగాలు, మ‌ఠాలు మాత్ర‌మే న‌డ‌పాలి. కేంద్రం యూసీసీ పేరుతో గురూజీల‌ను ఇన్‌వాల్వ్ చేసి హంగామా చేస్తోంది” అని మండిప‌డ్డారు.

భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అనే ఆలోచనకు BJP మళ్లీ జీవం పోస్తోంది. BJP పాలనలోని ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాయ్. BJP ఇచ్చిన ఎన్నికల హామీలలో అయోధ్య రామమందిరం, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ముఖ్యమైనవి. BJP చెప్పినట్లుగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైంది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించారు. ఇక ఇప్పుడు BJP యూనిఫాం సివిల్ కోడ్ మీద దృష్టి పెట్టింది.