karnataka elections: బీజేపీ నయా ప్లాన్‌.. మైనార్టీలను పట్టించుకోలేదు!

Bengalurur: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు(karnataka elections) దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ(bjp) కర్నాటకలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు.. 224గాను 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క ముస్లిం నాయకుడికి కూడా టిక్కెట్టు కేటాయించలేదు. తొలుత ఒకరు లేదా ఇద్దరు ముస్లింలకు బీజేపీ టిక్కెట్టు ఇస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ప్రధాని మోదీ, అమిత్‌షా మాత్రం ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదు. మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా.. ఇతర అభ్యర్థులనే ఎంపిక చేశారు. బెంగళూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని మైనారిటీలకు ఇస్తారని వినిపించినా ఇప్పటికే నగరంలోని మొత్తం 28 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇక బీజేపీ ప్రకటించాల్సింది.. రెండే రెండు స్థానాలకు అభ్యర్థులను అది.. ముస్లింలకు కేటాయించే అవకాశం లేదు.

బీజేపీ రానున్న ఎన్నికల్లో రెండే రెండు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. అందులో ఒకటి.. రిజర్వేషన్లు కాగా.. రెండోది హిందుత్వం అనే సున్నితమైన అంశంతో రానున్న ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తోంది. ఇప్పటికే కర్నాటకలోని ముస్లింలకు ఉన్న ఓబీజీ రిజర్వేషన్లను తొలగించి వాటిని ఇతర సామాజిక వర్గాలకు పంచింది. అంతేకాకుండా… కర్నాటకలో హిజాబ్‌ వివాదం వంటి అంశాల్లో బీజేపీ అనుసరించిన తీరు.. హిందువుల ఓటర్లకు దగ్గరికి చేసేలా చేసింది. ఇప్పటికే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం, సీఎం బొమ్మైను ప్రజలు సీఎం స్థాయిలో ఊహించుకునే చరీష్మా లేకపోవడం వంటివి బీజేపీకి సవాలుగా మారాయి.

ఇక బీజేపీ మైనార్టీలకు సీట్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌(JDS) తప్పుబట్టాయి. బీజేపీ.. మైనారిటీలకు ఏనాడూ ప్రాధాన్యత ఇవ్వలేదని జేడీఎస్‌ వ్యాఖ్యానించింది. గత శాసనసభ ఎన్నికల్లోనూ మైనారిటీలకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని.. బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీ మంత్రిత్వశాఖను కూడా ఇతరులే నిర్వహించాల్సి వచ్చిందని చెబుతోంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనూ ముస్లింలకు టికెట్‌ ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.