karnataka elections: BJPలో అసమ్మతి కలవరం!
Bengaluru: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు(karnataka elections) సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ(bjp)లో రాజీనామాల పర్వం పెరిగిపోవడం పార్టీకి నష్టం కలిగించేలా మారింది. గుజరాత్ ఫార్ములాను అనుసరించి బీజేపీ కొత్త వారికి సీట్లు కేటాయించింది. దాంతో టిక్కెట్టు దక్కని సీనియర్లు, ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు బీజేపీ కేంద్ర పెద్దలు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించట్లేదు.
ఇకనిన్న పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు మాజీ సీఎం జగదీష్ షెట్టర్(jagadish shettar resign) ప్రకటించారు. హుబ్బల్లి, ధార్వాడ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. సొంత పార్టీ నేతలే కుట్ర పన్ని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఆరోపించారు. తానేంటో రానున్న ఎన్నికల్లో నిరూపిస్తా అని సవాలు విసిరారు.
బీజేపీపై అసమ్మతి తెలియజేస్తూ.. ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు.. కాంగ్రెస్, జేడీ(ఎస్)లలో చేరుతున్నారు. ఇది వారికి వరంగా మారింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వంపై కర్నాటకలో అవినీతి ఆరోపణలు, పాలనపై వ్యతిరేకత, సీఎం బొమ్మె నాయకత్వ వైఫల్యం ఇతరత్రా కారణాలతో బీజేపీకి అధికారం కష్టమని ఓ వైపు సర్వేలు చెబుతున్నాయి. ఈక్రమంలో నాయకులు రాజీనామాల బాటపట్టడం కలవరపెడుతోంది.
ప్రధానంగా జగదీశ్ షెట్టర్ రాజీనామాతో.. రాష్ట్రం లోని 20-25 స్థానాలను ప్రభావితం చేయగలిగిన లింగాయత్‌లు బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీకి విధేయులుగా ఉన్నవారిని కాదని.. 12 మంది వలస నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చిందనే ఆరోపణను ఆ పార్టీ మూటగట్టుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరికీ టికెట్లు ఇస్తున్నారని.. పార్టీలో అయిదారుసార్లు గెలిచిన తమలాంటి వారిని నిర్లక్ష్యం చేసిందని ఎం.పి. కుమారస్వామి, రేణుకాచార్య, ఎస్. ఎ. రామదాస్ వంటి సిట్టింగులు బహిరంగంగానే పార్టీని విమర్శిస్తున్నారు. బీజేపీ ఇంకా 12 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కనీసం 50-60 స్థానాల్లో పార్టీకి అసమ్మతి నేతలు నుంచి ఒత్తిడి పెరుగుతోంది.