Kalvakuntla Kavitha: లిక్కర్ కేసు.. అసలే ఎన్నికలు.. ఇప్పుడు పిలిస్తే ఎలా?
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇటీవల సీబీఐ నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఆమె సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐకి లేఖ రాసారు. (Kalvakuntla Kavitha)
లేఖలో ప్రస్తావించిన అంశాలు
CRPC సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉప సంహరించుకోండి. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు.
ALSO READ: Delhi Liquor Scam: BRS వర్గాల్లో హై టెన్షన్
గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు… పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.
ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుంది. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుంది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి అని పేర్కొన్నారు.
Kavitha పక్షాన నిలిచిన సుప్రీంకోర్టు
గతంలో ఈడిపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోగా కోర్టు కవిత పక్షాన నిలిచింది. విచారణ కోసం మహిళను ఈడి కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈడీ పలుమార్లు కవితను దిల్లీలోని తమ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. ఓ మహిళను ఈడీ అలా కార్యాలయానికి పిలిపించుకుని ఎలా విచారిస్తారు అని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పట్లో కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. ఇంకా ఈ కేసు విషయం ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కవితకు సీబీఐ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.