Delhi Liquor Scam: BRS వర్గాల్లో హై టెన్షన్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కున్నారు. CBI (Central Bureau Of Investigation) ఆమెను నిందితురాలిగా చేర్చింది. ఇంత వరకు సాక్షిగా మాత్రమే పరిగణించిన కవితను ఇప్పుడు ఆమెను నిందితురాలిగా చేర్చడం విశేషం. ఈనెల 26న కవిత CBI ముందు హాజరుకావాల్సి ఉండగా.. ఈ పరిణామం చోటుచేసుకుంది. 41A కింద ఎమ్మెల్సీ కవితకు CBI నోటీసులు జారీ చేసింది. దీంతో భారత రాష్ట్ర సమితి (BRS) వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది.
గతేడాది ఇదే కేసులో 16 CRPC కింద కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది సీబీఐ. డిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత సీబీఐ నోటీసులు ఇవ్వడమే కాదు ఇప్పుడు కవితను నిందితురాలిగా పేర్కొనడం కలకలం రేపుతోంది. గతంలో ఇంటికి వచ్చి కేవలం స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ ఈ నెల 26న సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో ED (Enforcement Directorate) నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఆ పిటిషన్‌కు సంబంధించి ఈ నెల 28న విచారణ కూడా ఉంది. ఈ గ్యాప్‌లో వచ్చిన సీబీఐ నోటీసులకు కవిత స్పందిస్తారా లేక విచారణకు వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.
ఇప్పుడు ఇచ్చిన నోటీసులు CRPC సెక్షన్ 41ఏ ప్రకారం కాబట్టి.. ఈ సెక్షన్ ప్రకారం ఏ కేసులో అయినా సరే నిందితులుగా చేర్చిన తర్వాత అరెస్ట్ చేయని పక్షంలో వారిని విచారణకు పిలిపించాలి అనుకున్నప్పుడు ఈ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తారు. అది దర్యాప్తు సంస్థ సీబీఐ అయినా లేదా సాధారణ పోలీసులైనా సరే.. ఏ కేసులో ఇదే ప్రక్రియ వర్తిస్తుంది. ఇప్పుడు సీబీఐ కవితకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఈ సమన్లను బేఖాతరు చేస్తే ఈ నోటీసులను పట్టించుకోకపోతే కనుక ఆ దర్యాప్తు సంస్థకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది.
అది కూడా వెంటనే అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇదివరకు సీబీఐ ఇచ్చిన నోటీసులు కూడా CRPC సెక్షన్ల ప్రకారమే ఇచ్చారు. నిందితురాలిగా ఉన్న కవిత అప్పుడు సాక్షిగా ఉన్నారు కాబట్టి ఆమె మహిళ కాబట్టి ఆమె వద్దకే వెళ్లి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లిపోయారు. తర్వాత ఇదే కేసును దర్యాప్తు ఈడీ మాత్రం తమ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపించడం.. పలు మార్లు ప్రశ్నించడం జరిగాయి. ఈ నేపథ్యంలో కవిత ఈడీ విచారణ తీరుతెన్నులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్లో ఈడీ సీఆర్పీసీ నిబంధనలను పాటించడంలేదు.. ఒక మహిళను ఎలా విచారించాలో అలా విచారించడంలేదు అని పేర్కొన్నారు.
ఇంకా ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ విషయం పక్కన పెడితే ముందు ఈ కేసు నమోదు చేసింది సీబీఐ అని.. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిందని.. అందులో కొందరు అప్రూవర్లుగా కూడా మారారన్న విషయం తెలిసిందే. చాలా మంది స్టేట్మెంట్లలో కీలకంగా మారాయి. కవిత వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కౌశిక్ వాంగ్మూలం కూడా కీలకమైన ఆధారంగా మారింది. చాలా మంది కవిత పేరు ప్రస్తావించారు కాబట్టే ఆమెను నిందితురాలిగా చేర్చింది.
మరోపక్క ఇదే కేసులో మరో నిందితుడిగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఐదోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు జారీ చేసిన నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు. దాంతో ఈసారి కూడా ఆయన స్పందించకపోతే రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.