Kakani Govardhan Reddy: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే 2009లోనే తెలుగు దేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి మరణంతో మళ్లీ తెలుగు దేశం పార్టీ పుంజుకుందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీకి 23 సీట్లు వస్తే.. ఇక చంద్రబాబు పనైపోయింది.. మంచానపడతాడు అనుకున్నారని.. కానీ ఈరోజు మళ్లీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టాడని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదని.. ఈరోజు మనది కాకపోయినా రేపు మరింత బలంగా నెగ్గుకు రావడానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
“” తమిళనాడులో ఎంజీఆర్ బతికున్నప్పుడు ఏ పార్టీని కూడా గెలవనిచ్చేవారు కాదు. ఆ తర్వాత ఎంజీఆర్ చనిపోయాక కరుణానిధి రాజ్యం ఏలాలని అనుకున్నారు. కరుణానిధి పోటీ చేసినప్పుడు జయలలిత మెజారిటీ సీట్లతో గెలిచారు. ఆ తర్వాత కరుణానిధి మంచానపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మెజారిటీ సీట్లు గెలుచుకున్న జయలలిత కేవలం 4 సీట్లు గెలిచారు. అందుకే చెప్తున్నా. మనకు 11 సీట్లు వచ్చాయని డీలాపడిపోవద్దు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు “” అని తెలిపారు.