
Kakani Govardhan Reddy: తెలుగు దేశం పార్టీ నేతలంతా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు చెప్పాలని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు పెన్షన్ తీసుకోవాలంటే ప్రజలు ఓ కార్యాలయానికి వెళ్లి పడిగాపులు కాసి మరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని.. జగన్ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల ద్వారా ఇళ్లకే పంపిణీ చేయడం మొదలుపెట్టామని అన్నారు. ఇప్పుడు అదే వాలంటీర్లతో పింఛన్లు ఇప్పించిన చంద్రబాబు.. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినందుకు జగన్కు అభినందనలు తెలపాలని అన్నారు.
చంద్రబాబు నాయుడే వాలంటీర్ వ్యవస్థను కనిపెట్టినట్లు ఓవరాక్షన్ చేస్తున్నారని.. పైగా వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆ సచివాలయ వ్యవస్థను నిర్మించింది కూడా జగనే అని తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసినా కూడా దానికి మార్గదర్శి మాత్రం జగన్ మోహన్ రెడ్డే అని చెప్పారు.