BJP: నాకు పోటీ చేయాల‌ని లేదు.. అయినా టికెట్ ఇచ్చారు

ఎంత వ‌య‌సు వ‌చ్చినా ఎన్నిక‌ల్లో ఇంకా నిల‌బ‌డాల‌ని పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌వారు చాలా మందే ఉన్నారు. టికెట్లు ఇవ్వ‌క‌పోతే బోరున విల‌పించడం.. అలిగి పార్టీ వీడి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నవారిని చూస్తూనే ఉన్నాం. కానీ BJP సీనియ‌ర్ నేత కైలాశ్ విజ‌య‌వ‌ర్గీయ (kailash vijayvargiya) మాత్రం ఈ ట్రెండ్‌కి వ్య‌తిరేకంగా ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పోటీ చేసేందుకు ఈసారి బీజేపీ కైలాశ్ పేరును చేర్చింది. అది చూసి కైలాశ్ షాక‌య్యార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.

“” నా వ‌య‌సు 67. ఇంకా నేను రాజ‌కీయాల్లో చేతులు జోడించి ఓటు వేయ‌మ‌ని ఎలా అడ‌గాలి? నా పేరును జాబితాలో చేర్చ‌డం చూసి నేను షాక‌య్యాను. నాకు పోటీ చేయాల‌న్న ఆశ 1 శాతం కూడా లేదు. న‌న్ను కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తే ఏదో ప్ర‌సంగించ‌డానికి ర‌మ్మంటున్నారేమో అనుకున్నా. కానీ పోటీ చేయ‌మ‌ని అడుగుతార‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నేను కేవ‌లం ప‌బ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనాల‌ని అనుకున్నాను. మొత్తం 9 మీటింగ్స్ ప్లాన్ చేసాను. కానీ నేను ప్లాన్ చేసిన‌ట్లు జ‌ర‌గలేదు. దేవుడు ఎలా నిర్ణ‌యించాడో అలాగే జ‌రుగుతోంది. ఆ దేవుడికి నేను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి పోటీ చేయాల‌ని ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని ఉందేమో. అందుకే టికెట్ వ‌చ్చేలా చేసాడు “” అని తెలిపారు.