Jogi Ramesh: తప్పు చేసుంటే మేమే ఉరేసుకుంటాం చంద్రబాబు గారూ..
Jogi Ramesh: వైఎస్సార్ కాంగ్రెస్ నేత జోగి రమేష్ నివాసంలో ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం గ్రామంలో అగ్రి గోల్డ్ డిపాజిటర్లకు చెందిన భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కబ్జా చేసాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసారు. తమది తక్కువ కులం కాబట్టే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. చంద్రబాబు నాయుడుకు కూడా ఓ కొడుకు ఉన్నాడని.. ఓ తండ్రిగా తాను పడుతున్న బాధ ఆయనకు తెలుసని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ కూడా ఇలా తప్పుడు కేసులు బనాయించి సోదాలకు పాల్పడి అరెస్ట్‌లు చేయలేదని అన్నారు. నిజంగా తను కానీ తన కుటుంబం కానీ తప్పు చేసి ఉంటే ఈ అరెస్ట్‌లు కూడా అవసరం లేదని.. కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకునేవాళ్లం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
గతంలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆందోళన చేసిన విషయాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఈరోజు తన కుమారుడిని అరెస్ట్ చేయించారని.. ఆరోజు తాను కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆందోళనలో పాల్గొనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.