Janasena: టార్గెట్ గోదావరి..!
Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎట్టకేలకు తన ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా పవన్ వారాహి యాత్రను (Varahi Yatra) ప్రారంభించకపోవడంపై కార్యకర్తలు, జనసైనికులు, నేతలు ఆందోళన చెందారు. మరోపక్క పొత్తులో భాగంగా ఉన్న తెలుగు దేశం పార్టీ మాత్రం ప్రచారాలతో బిజీ అయిపోయింది. ఓపక్క తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మరోపక్క ఆయన సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) ప్రచారాలు, ఓదార్పు యాత్రలతో బిజీ అయిపోయారు. కానీ పవన్ మాత్రం రెండు నియోజకవర్గాలు ప్రకటించి మరీ ఇంకా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టలేదు.
ఈ నేపథ్యంలో జనసైనికులకు పవన్ కళ్యాణ్ నుంచి కాస్త ఊరట కలిగించే వార్త అందింది. టార్గెట్ ఉభయ గోదావరి పేరిట పవన్ 14 నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. 14వ నుంచి 17వ తేదీ వరకూ భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న టార్గెట్‌తోనే ఈ సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. 14న భీమవరం సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రభావశీలురు, ముఖ్య నేతలతో పవన్ భేటీ అవుతారు.
ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావం లక్ష్యంగా భేటీలు అవుతాయి. ఈసారి పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా జరగనున్నాయి. తొలి దశలో ముఖ్యనాయకులు, ప్రాంతాల వారీగా ఉన్న ప్రభావశీలురుతో సమావేశమవుతారు. రెండో దఫా పర్యటనలో పార్టీ స్థానిక కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశంలో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. (Janasena)
ఎన్నికల ప్రచారం మొదలయ్యే సరికి పవన్ కళ్యాణ్ మూడు దఫాలుగా పార్టీకి సంబంధించిన వారితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అది ఇప్పుడే కాదు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే చివరి దశలో ముగ్గురు నేతలు కలిసి ప్రజల ఆశీర్వాదం కోసం చివరి సభను ఏర్పాటుచేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోపక్క మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు YSRCP ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తోంది. సిద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రచార కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) భేటీ అయిన జగన్ దాదాపు 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు తెలిపి గెలిచేలా చేస్తే భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) నుంచి ఏ నేతకు రాజ్యసభ సీటు కావాలన్నా తాను చూసుకుంటానని మాటిచ్చినట్లు తెలుస్తోంది.