Janasena: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..!?
Janasena: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయం గురించి ఇంకా ప్రకటించలేదు. మొన్న తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జనసేన పార్టీలు కలిసి సీట్ షేరింగ్ వివరాలను ప్రకటించినప్పుడు కూడా మీరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు సర్ అని అడగ్గా.. జస్ట్ నవ్వి చెప్తాను కదా అని చెప్పేసి వెళ్లిపోయారు. చాలా మంది పవన్ భీమవరం (Bheemavaram) నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఎందుకు ప్రకటించలేదనే దానిపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. విస్తృత కసరత్తు తర్వాత పవన్ ఎట్టకేలకు పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (Janasena)
ALSO READ: Kanakamedala: TDPకి అనుకూలంగా మరో సర్వే
పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 90 వేలకు పైగా ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖరారైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చు అనేది జనసేన వ్యూహంగా ఉంది.
దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మధ్యలో భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన టీంతో సర్వే చేయించుకున్నాక పిఠాపురం అయితే బాగుంటుందని అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పిఠాపురంలోని గొల్లప్రోలులో నాలుగు ఎకరాల్లో ఒక హెలీప్యాడ్‌ను కూడా లీజ్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో కాపు వర్గ ఓట్లు అధికంగా ఉండటం.. ఈ ప్రభావం మేరకు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓవరాల్‌గా కాకినాడ పార్లమెంట్‌తో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువ సీట్లు తెలుగు దేశం, జనసేన కూటమి సాధిస్తుందని పవన్ గట్టిగా నమ్ముతున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రానివ్వనని గతంలో పవన్ కళ్యాణ్ శపథం చేసారు. వారాహి యాత్రను కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు అనే ఉద్దేశంలో భాగంగానే పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన మరి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ALSO READ: AP Elections: 9 సీట్లకు BJPతో డీల్ ఓకే..?!