పాకిస్థాన్‌కు జైశంక‌ర్.. సుష్మా స్వ‌రాజ్ త‌ర్వాత వెళ్ల‌నున్న‌ తొలి మంత్రి

jaishankar to go to pakistan

Jaishankar: విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్ పాకిస్థాన్‌కు వెళ్ల‌నున్నారు. చివ‌రి సారి భార‌త్ నుంచి పాక్‌కి వెళ్లిన మంత్రి దివంగ‌త సుష్మా స్వ‌రాజ్. ఆమె 2015లో ఇస్లామాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. ఆ త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క భార‌తీయ నేత కూడా పాక్‌కు వెళ్ల‌లేదు. ఇప్పుడు జైశంక‌ర్ వెళ్ల‌నున్నారు.

అక్టోబ‌ర్ 15, 16 తేదీల్లో పాకిస్థాన్‌లో షాంఘాయ్ కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (SCO) కాంక్లేవ్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గ‌వర్న‌మెంట్ కార్యక్ర‌మానికి పాకిస్థాన్ ఆతిథ్యం వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త్ హాజ‌రైతే బాగుంటుంద‌ని పాకిస్థాన్ ఆహ్వానం పంపగా కేంద్రం ఇందుకు ఒప్పుకుంది. ఈ నేప‌థ్యంలో జైశంక‌ర్ ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. ఈ SCO కార్య‌క్ర‌మాన్ని గ‌తేడాది భార‌త్ చేప‌ట్టింది. ఈ కార్యక్ర‌మంలో భార‌త్‌, పాకిస్థాన్‌ల‌తో పాటు చైనా, ర‌ష్యా, తజికిస్థాన్, క‌జ‌క‌స్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు కూడా పాలు పంచుకోనున్నాయి. 2005 వ‌ర‌కు SCO స‌మావేశాల్లో భార‌త్ ఒక అబ్స‌ర్వ‌ర్‌గా మాత్ర‌మే ఉంది. 2017లో ఫుల్ మెంబ‌ర్ స్ట‌ట్‌గా మారింది. 2001లో షాంఘాయ్‌లో ఈ SCO స‌మ్మిట్‌ను ర‌ష్యా, చైనా, క‌జ‌క‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల‌కు చెందిన అధినేత‌లు ఏర్పాటుచేసారు. దీనిలో పాకిస్థాన్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఉంది.

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్ బాలాకోట్‌లో మెరుపుదాడుల‌కు పాల్ప‌డ‌టంతో ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఎప్పుడైతే ఉగ్ర‌వాదాన్ని పాకిస్థాన్ పూర్తిగా అరిక‌డుతుందో అప్పుడే భార‌త్ మ‌ళ్లీ స్నేహ‌పూర్వ‌క చ‌ర్య‌ల‌ను చేప‌డుతుంద‌ని ప‌లుమార్లు పాక్‌ను హెచ్చ‌రించింది.