Chandrababu సెల్ఫీ ఛాలెంజ్‌పై జగన్‌ మాస్‌ కౌంటర్‌!

markapur: లంచాలు వివక్ష లేని పరిపాలనతో కేవలం నాలుగేళ్లలోనే చరిత్ర సృష్టించామని, కుల, మత, ప్రాంత రాజకీయ పార్టీలనే బేధం లేకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించామని సీఎం జగన్(jagan) పేర్కొన్నారు. మార్కాపురంలో నిర్వహించిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం(ysr ebc nestha) నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్(jagan) ప్రసంగించారు. 45 -60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదరికానికి కులం, మతం ఉండదని.. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఓసీ కులాల్లోని పేద అక్క చెల్లెమ్మలకోసం రూ.658 కోట్లు ఈరోజు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఇప్పటివరకూ రూ. 1257 కోట్లు ఇచ్చామని.. దాదాపు 4 లక్షలమంది లబ్ధిదారులు రెండో దఫా అందుకున్నట్టు అవుతుందన్నారు.

గత ప్రభుత్వంలో చేసిన మంచిపై పేదవాడి ఇంటి వద్ద నిల్చొని సెల్ఫీ ఛాలెంజ్ (selfie challenge)చేయాలని చంద్రబాబుకు సీఎం జగన్ సూచించారు. ఈ పని చంద్రబాబు చేయకపోవడానికి కారణం ఆయన హయాంలో పేదలకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం చేకూర్చకపోవడం కారణమని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డీబీటీ అమలు చేస్తుంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం దొచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్దతి అమలు చేసిందని మండిపడ్డారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదని.. పేదవాడికి చేసే మంచే తనకు సెల్ఫీ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నిజాలు దాచి అబద్దాలు అసత్య ప్రచారాలతో తన ఎల్లో మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.