RK Roja: రోజా ఫిర్యాదుతో ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసిన జగన్
RK Roja: ఎన్నికల్లో నగరి నుంచి ఘోర ఓటమి పాలైన రోజా తాను నగరి ప్రజలకు ఎంత మంచి చేసానో తన మనసుకి.. ప్రజలకి తెలుసని పలు సందర్భాల్లో వెల్లడించారు. నగరిలో రోజా ఎంత చేసినప్పటికీ ఆమె 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తన ఓటమికి కారణం ప్రజలు కాదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు, అధికారులే అని రోజా ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జగన్ మోహన్ రెడ్డిని కలిసి రోజా తన ఆవేదనను వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లాలో జగన్ ఇటీవల రివ్యూ మీటింగ్ పెట్టడంతో రోజా తనకున్న సమస్యలను, తనను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను జగన్ వద్ద ప్రస్తావించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ అయిన కేజే కుమార్, కేజే శాంతిలను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. వీరిద్దరూ తెలుగు దేశం పార్టీకి చెందిన గాలి భాను ప్రకాష్ కోసం పనిచేసారని రోజా జగన్కు ఫిర్యాదు చేసారు. రోజా ఎప్పటినుంచో వీరిద్దరి గురించి జగన్ వద్ద ప్రస్తావిస్తున్నప్పటికీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగా జగన్ రోజా మాటలను అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పార్టీ 11 సీట్లకే పరిమితం కావడంతో జగన్ దగ్గరుండి అందరి నుంచి రివ్యూలు తీసుకుంటున్నారు. ఇది ఒక రకంగా రోజాకు కాస్త గుడ్న్యూస్ అయినప్పటికీ ఆమె నగరిలో ఉండటం లేదు. ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. ఏదన్నా అవసరమైన కార్యక్రమాలు ఉంటే తప్ప నగరికి రావడంలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.