Jagan: ఇందులో అబద్ధం ఏముందన్నా.. విలేకరితో జగన్ చర్చ
Jagan: విజయవాడ వరదలు ప్రకృతి పరంగా ఏర్పడినవి కాదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఏర్పడిన నష్టం అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు కూడా జగన్ వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియా వారితో మాట్లాడారు.
“” ఆగస్ట్ 28న వాతావరణ శాఖ తుఫాను ముప్పు ఉందని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అలెర్ట్ అయ్యి అర్థరాత్రి బుడమేరు గేట్లు ఎత్తాడు. ఆ గేట్లు ఎత్తకపోయి ఉంటే చంద్రబాబు నివాసం నీటమునిగేది. ఆయన గేట్లు ఎత్తడం వల్లే దాదాపు 6 లక్షల మంది ప్రజలు రోడ్డునపడ్డారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు.. ఆయన పాంఫ్లెట్ అయిన ఈనాడు పత్రికలోనే రాసారు. కావాలంటే జర్నలిస్ట్ సోదరులు ఒకసారి ఆ వార్త చదవండి. పైగా ఈరోజు సిగ్గులేకుండా అధికారులను తీసేస్తాను అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అందరు అధికారులను నీకు నచ్చినట్లు మార్చుకున్నావు. మరి నీకు నచ్చినట్లు నువ్వు మార్చుకుని నువ్వే వారు సరిగ్గా పనిచేయకపోతే తీసేస్తాను అంటున్నావంటే ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి.. నా వల్లే ఈ నష్టం వాటిల్లింది అని లేఖ రాసి మరీ క్షమాపణలు చెప్పాలి “” అని వెల్లడించారు.
జగన్ మాట్లాడుతుండగా ఓ విలేకరి సర్ మీ వ్యాఖ్యల్లో లాజిక్ లేదని అన్నీ అసత్యాలే అని చంద్రబాబు అంటున్నారు. దీనిపై మీ స్పందనేంటి అని అడిగాడు. దీనికి జగన్ బదులుగా.. నీపేరు ఏంటి అని అడిగి ఆ విలేకరి పేరు తెలుసుకుని మరీ.. నువ్వే చెప్పన్నా నా మాటల్లో ఇల్లాజికల్ ఏముంది? అసత్యాలు ఏమున్నాయ్? ఆగస్ట్ 28న హెచ్చరికలు వచ్చిన సంగతి ప్రజలకే తెలిసినప్పుడు చంద్రబాబుకు తెలీదా? ముందుగానే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్న విషయం తెలీదా? కృష్ణా నది పొంగుతుందని తెలీదా? మరి నా మాటల్లో లాజిక్ లేకపోవడానికి ఏముందన్నా అని చెప్పి మరో ప్రశ్న అడగబోతుంటే జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.