Jagan: అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా కలవచ్చు.. !
Jagan: ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తప్పును తెలుసుకున్నట్లున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో సమావేశాలు కాకుండా కేవలం ఏదన్నా అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంటేనే సభలకు వచ్చేవారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఏదన్నా ఫైల్ పట్టుకుని తమ కష్టాలను చెప్పుకుందామని తాడేపల్లిగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లినా లోనికి రానివ్వకుండా రాత్రి వరకు బయటకే వెయిట్ చేయించేవారని ఇప్పటికే ఎందరో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు.
ఐదేళ్లూ ఇదే తంతు ఉండటంతో పార్టీ ఘోర ఓటమి పాలైంది. దాంతో తన తప్పును తెలుసుకున్న జగన్.. తన పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. మొన్న ఓడిపోయిన, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి సముదాయించిన జగన్.. నేడు ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా వారిని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య 40కి పైగా ఉంది. ప్రభుత్వ బిల్లుల విషయంలో ఎమ్మెల్సీలదే కీలక వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ పార్టీని పునర్మించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది వరకటిలా కాకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఈసారి గతంలో జరిగిన నిర్లక్ష్యం చేయనని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.