సుప్రీంకోర్టు మిమ్మల్ని తిడితే మా గురించి రాస్తారేంటి?
Jagan: తిరుమల లడ్డూ కల్తీ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. వాదనలన్నీ విన్నాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. NDDB రిపోర్టు జులైలోనే ఇస్తే ఎందుకు సెప్టెంబర్లో బయటపెట్టారు అని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలను అంతర్గతంగా విచారణ చేయించకుండా చంద్రబాబు నేరుగా మీడియా ముందుకు వెళ్లి మీర ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని.. అసలు కల్తీ జరిగిందన్న ఆధారాలు లేకుండా మీడియా ముందుకు వెళ్లి హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీసారు అన్న ప్రశ్నలను గుప్పించింది. అయితే.. ఈరోజు లడ్డూ కల్తీపై విచారణ ఎలా చేపట్టాలన్న విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ డైరెక్టర్ నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో సిట్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేసారు.
సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఆయన కోసం పని చేసే పేపర్లన్నీ తనను, వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని రాసాయని.. జాతీయ మీడియా వర్గాలు మాత్రం చంద్రబాబుదే తప్పని రాసాయని అన్నారు. చివరికి సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను కూడా తప్పుగా ప్రచురించి మళ్లీ తనపై తన పార్టీ నేతలపై బుదర జల్లాలని చూస్తున్నారంటే చంద్రబాబు ఎంతకు దిగజారిపోయారో ప్రజలకు కూడా అర్థమవుతోందని అన్నారు. ప్రజలు సూపర్ సిక్స్ కోసం ఎదురుచూస్తుంటే చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఏ కొత్త డ్రామా మొదలుపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి పథకాలను ఎగ్గొట్టాలా అని చూస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీబీఐ డైరెక్టర్ నేపథ్యంలో జరిగే సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని.. తమ పార్టీది తప్పు ఉందని తెలిస్తే ఏ శిక్షకైనా రెడీ అని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు.