Jagan Mohan Reddy: మోసం జరిగింది.. కానీ నిరూపించడానికి ఆధారాల్లేవ్
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. తన ఓటమికి కారణాలను వివరించారు.
“” అమ్మ ఒడి అందుకున్నవారి పిల్లల చదువులు బాగుండాలని తాపత్రయ పడుతూ అడుగులు వేసారు. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వా తాతలకు వితంతువులు, వికలాంగులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేసాం. కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను తీసుకొచ్చాం. గతంలో మా ప్రభుత్వం రాక ముందు చాలీచాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలీయడంలేదు. దాదాపు కోటి ఐదు లక్షల మందికి మంచి జరిగేలా చూస్తూ వారి కష్టాలను మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాటా తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. సున్నా వడ్డీతో అండగా ఉన్నాం. చేయూత సైతం అండగా ఉంటూ నిలిచాం. మరి వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలీదు. 26 మంది చేయూతను అందుకున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలీదు.
పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదని మొదటిసారి పూర్తి ఫీజులు ఇచ్చి చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపు 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగేలా చూస్తుంటే ఆ తల్లుల అభిమానం ఏమయ్యిందో. 58 లక్షల రైతులకు ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చాకే జరిగింది. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు భరోసా ఇవ్వడం కానీ సమయానికి వారికి ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగా ఇచ్చాం. ఉచిత బీమా, పగటి పూట 9 గంటల కరెంట్, ఉచిత విద్యుత్.. మరి రైతన్న ప్రేమ ఏమైందో తెలీదు.
ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్య్సకారులకు భరోసా, ఫుట్‌పాత్‌పై చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి మంచి జరగాలని ఆరాటపడుతూ వారికో తోడు చూపెట్టాను. ఇన్ని కోట్ల మందికి ఇంత మంచి చేసి మేనిఫెస్టో అంటే చెత్తలో పడేసేది కాదు అది ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లి వారి చేత టిక్ పెట్టించేలా పని చేసాం. మరి ఆ అభిమానం, ఆప్యాయత ఏమయ్యాయో తెలీదు.
ఎవరో మోసం అన్యాయం చేసారు అని అనచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటాం. పేద వాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసిస్తారు. కూటమిలో ఉన్నవారందరికీ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీరుకు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఏం చేసినా ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంక్‌ను మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా మళ్లీ లేస్తాం. మళ్లీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో మళ్లీ వస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. పోరాటాలు చేయడం అంత కన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలోనే గడిపా. పోరాటాలే చేసా. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది బెస్ట్“” అని తెలిపారు.