Ramoji Rao: మూడు సార్లు కలిసినా.. ఉపయోగం లేకపాయె!
Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఈనాడు పత్రికను స్థాపించినప్పటి నుంచి తెలుగు దేశం పార్టీకే మద్దతు ఇస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎదగడానికి రామోజీ రావు కూడా ఒక కారణమే. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా పలుమార్లు రామోజీ రావును కలిసారు. 2015లో ఒకసారి.. 2017లో రెండు సార్లు కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ అందుకు రామోజీ రావు అస్సలు ఒప్పుకోలేదు. తన మద్దతు ఎప్పుడూ కూడా మంచి చేసేవారికే ఉంటుందని.. ఈనాడు పత్రిక స్థాపించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీతో తన స్నేహం ఎంతో బలపడిందని చెప్పి పంపించారు.
దాంతో జగన్‌కు ఈనాడు, రామోజీ రావు శత్రువులుగా మారారు. అందుకే పలుమార్లు జగన్ మోహన్ రెడ్డి తన పోరాటం కేవలం చంద్రబాబు నాయుడుతో కాదు ఈనాడు, ఏబీఎన్, టీవీ5లతో కూడా పోరాడుతున్నానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఉండటం మన ఖర్మ. నా గురించి తప్పుగా రాస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
నాడు వైఎస్సార్‌తో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు జరిగిన అవినీతి అంశాలను ఈనాడు పత్రిక నిర్భయంగా బయటపెట్టింది. దాంతో వైఎస్సార్ రామోజీ రావుకు శత్రువుగా మారారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా రామోజీ రావు భయపడలేదు. ఆ తర్వాత వైఎస్సార్ దుర్మరణం చెందడంతో రామోజీ రావు కూడా వ్యతిరేకంగా పత్రికలో రాయించడం మానుకున్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో మళ్లీ వ్యతిరేకత మొదలైంది.
2014 ఎన్నికల తర్వాత రామోజీతో అంత సులువు కాదు అన్న విషయం జగన్‌కు బాగా అర్థమైంది. దాంతో తన కోసం ఓ మీడియా ఛానెల్ ఉండాలన్న ఉద్దేశంతో జగన్ సాక్షి పేరుతో మీడియా సంస్థలను ప్రారంభించారు. తాను మంచి చేస్తున్నా కూడా అది అవినీతి అని ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలను ప్రచురిస్తోందని భావించి.. తనకు సంబంధించిన ప్రతి వార్తను పాజిటివ్ కోణంలో రాయిస్తూ సాక్షి పేపర్, ఛానెల్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చూసారు జగన్. సాక్షికి మంచి పాపులారిటీ అయితే వచ్చింది కానీ ఈనాడును మాత్రం బీట్ చేయలేకపోయారు.
మార్గదర్శిని టార్గెట్ చేసి
గతేడాది జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ సాయంతో మార్గదర్శిని టార్గెట్ చేసారు. మార్గదర్శిలో పెట్టుబడులు పెడుతున్నవారి డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని కేసులు వేయించారు. పోలీసులను రామోజీ నివాసానికి పంపి విచారణ చేయించాలని చూసారు. రామోజీ రావు అనారోగ్యంతో మంచంపై ఉన్న ఫోటోను సాక్షి పేపర్‌లో సర్క్యులేట్ చేయించారు.
తనను తన కోడలు శైలజను ఎంతో క్షోభపెట్టిన జగన్ పతనాన్ని కళ్లారా చూడాలనుకున్నారు రామోజీ. ఇందుకోసం రోజూ ఈనాడు పత్రిక, వెబ్‌సైట్లలో జగన్ అరాచకాలను.. బయటికి రాని అవినీతిని రోజూ ప్రచురించేవారు. ఎప్పటికప్పుడు జగన్ చేస్తున్న అబద్ధపు వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్లీ అధికారం దక్కించుకుందంటే.. రామోజీ రావు కూడా ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పచ్చు. అలా తన చిరకాల మిత్రుడైన చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారం చూడకుండానే రామోజీ రావు వెళ్లిపోవడం బాధాకరం.