Jagan: అది జరగాలంటే నేను సీఎం కుర్చీలో ఉండాలి
Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అనగానే ప్రజలు ఆశపడి ఓట్లు వేసారని.. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. రోజుకో కొత్త కథను తెరపైకి తీసుకొస్తున్నారని.. కూటమి పాలనలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. పిల్లలకు చదువులు, రైతన్నలకు సాయం, వృద్ధులకు పెన్షన్, ఆడబిడ్డలకు డబ్బు ఇలా అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి నచ్చినవారికే పథకాలు ఇవ్వాలనుకుంటే ఇస్తారని లేకపోతే లేదని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ పోయి మళ్లీ జన్మభూమి వ్యవస్థలు తీసుకొస్తున్నారని.. ఐదేళ్లుగా తాను నిర్మించిన రాజ్యాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు కూల్చేస్తాడని విమర్శలు గుప్పించారు. పార్టీని మళ్లీ పునర్నించుకోవాలంటే ప్రతి ఒక్క నేత, కార్యకర్త గుండెలో ఆ ఫైర్ అనేది ఉండాలని అన్నారు. అందుకే వారంలో ఒక రోజు ఒక్కొక్క బ్యాచ్‌తో సమావేశమై ధైర్యాన్ని నింపుతున్నానని తెలిపారు. దేశంలో ఎవ్వరూ టచ్ చేయలేని పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉండాలనే దిశగా తాను అడుగులు వేస్తున్నానని.. రాష్ట్రంలో తనను నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు మళ్లీ బాగుండాలంటే తాను సీఎం కుర్చీలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది కానీ ప్రతిపక్షంలో ఉంటే ఏమీ చేయలేమని జగన్ పిలుపునిచ్చారు.