Jagan: అవ్వా పెన్షన్ వచ్చిందా? సచివాలయం వెళ్లి తెచ్చుకున్నావా?
Jagan: ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం యాత్రలో భాగంగా ఊరూరా తిరిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆడవారంతా ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుండగా… ఓ ముసలి అవ్వను జగన్ దగ్గరికి పిలిచి.. అవ్వా.. పెన్షన్ వచ్చిందా? సచివాలయం వెళ్లి నువ్వు తెచ్చుకున్నావా? అంతా బాగానే ఉందా? అని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అవుతోంది.
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వృద్ధులకు, వికలాంగులకు వాలంటీర్ల చేత పెన్షన్లు ఇప్పించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో కాకుండా నేరుగా వారి ఖాతాల్లో వేసేలాగా కానీ.. లేదంటే మరేదైనా మార్గం ద్వారా కానీ వారికి పెన్షన్లు అందజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు లేక సమయానికి పెన్షన్లు పడక వృద్ధులు, వికలాంగులు ఎంతో అవస్థ పడుతున్నారు. నిన్న పెన్షన్ కోసం ఎండలో ఎదురు చూసి ఓ వృద్ధురాలు వడదెబ్బతో చనిపోయింది. పెన్షన్లు ఆపించింది తెలుగు దేశం పార్టీనే అని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణలు దిగింది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదే అని వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల పనులకు వాడుకోకూడదని చీవాట్లు పెట్టింది. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.