Jagan: అందుకే రాజధానిగా అమరావతి వద్దంటున్నా
Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుంది. అదే కూటమి (తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా మారుతుందన్న విషయం తెలిసిందే. అయితే అమరావతి ఏపీ రాజధానిగా వద్దు అని ఎప్పటినుంచో ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికీ ఆయన ఇదే మాట మీదున్నారు. తాను అధికారంలోకి వస్తే వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం జరుగుతుందని కూడా చెప్పారు. అయితే ఎందుకు తాను అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వద్దంటున్నారో ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు.
“” అమరావతి అనేది గుంటూరులో లేదు విజయవాడలో లేదు. గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో.. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా అమరావతి అంతా బీడు భూములే ఉన్నాయి. అక్కడ బిల్డింగులు కట్టడం మాట దేవుడెరుగు కనీసం విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజ్ కూడా నిర్మించలేని పరిస్థితి. బీడు భూముల్లో ఏదన్నా కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? పోనీ అమరావతిని రాజధానిగా చేసి డబ్బులు వెచ్చించి ఏదన్నా నిర్మించాలనుకున్నా కూడా ఏళ్లు గడిచే కొద్ది అమరావతి నిర్మాణానికి లక్షలాది కోట్లు ఖర్చు అవుతాయి. అంత అవసరం ఏముంది? మనకు వైజాగ్ ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరం. అలాంటి వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించి ఒక రాజధానికి అవసరం అయినవి కట్టుకుంటే రేపు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడచ్చు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. అసలు ఏపీకి రాజధానే లేకుండాపోతుంది “” అని తెలిపారు.