Jagan About TTD Laddoo: అయితే కన్విన్స్.. లేదా కన్‌ఫ్యూజ్
Jagan About TTD Laddoo: ఇంగ్లీష్‌లో ఒక నానుడి ఉంది. కన్విన్స్ చెయ్యలేకపోతే కన్‌ఫ్యూజ్ చెయ్యి అని. ఇది ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా వర్తిస్తుందనే చెప్పాలి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. జాతీయ స్థాయిలో తిరుమల లడ్డూ చర్చనీయాంశంగా మారింది. అసలు తిరుమల గొప్పతనం తెలీనివారు కూడా ఎంత అపచారం జరిగిపోయింది అని వాపోతున్నారు. అలాంటిది.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారని ఆరోపణలు వస్తుంటే ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ముందు ఆ విషయం గురించి మాట్లాడలేదు.
ప్రెస్ మీట్ మొదలవ్వగానే ఎప్పటిలాగే పేపర్ పట్టుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ఒక్కటీ అమలు కాలేదు అనే అంశంతో ప్రసంగం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు జగన్ వివిధ పాయింట్స్‌పై మాట్లాడి తాను కన్‌ఫ్యూజ్ అవుతూ మీడియాను, ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసారనే చెప్పాలి. చంద్రబాబు పథకాలు అమలు కాలేదు అని మొదలుపెట్టిన జగన్ రెండో పాయింట్ గురించి మాట్లాడుతూ.. లడ్డూ తయారీ విషయంలో TTD ఎన్నో ప్రామాణిక అంశాలను దృష్టిలో పెట్టుకుంటుందని.. అసలు కల్తీ నెయ్యి ఉందని తెలిస్తే దానిని వెంటనే రిజెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడతారని అన్నారు. ఆ తర్వాత లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడుదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేసారు. జులైలో వచ్చిన లడ్డూ సాంపుల్ డేటా చూపిస్తూ ఆ నెలలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే కాబట్టి బాధ్యత ఆయనే తీసుకోవాలని అన్నారు.
ఆ తర్వాత ల్యాబ్ రిపోర్టులు 100 శాతం కరెక్ట్ ఫలితాలను ఇవ్వవు అని అన్నారు. అనంతరం నెయ్యి కల్తీదే కానీ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో మాత్రం వాడలేదు అన్నారు. ఇక చివరి నిమిషంలో ఎలా తెలియజేయాలో అర్థంకాక తిరుమలకు సంబంధించిన అన్ని అంశాలు బోర్డే చూసుకుంటుందని దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పారు. ఇలా 40 నిమిషాల ప్రెస్‌మీట్‌లో కాసేపు లడ్డూ తయారీ విషయంలో తప్పు జరిగిందని.. కాసేపు జరగలేదని.. కాసేపు తప్పు చంద్రబాబుదే అని చెప్పి ముగించారు. జగన్‌తో వచ్చిన సమస్య ఏంటంటే.. పేపర్ చూస్తూ మాట్లాడటం.. ప్రెస్ మీట్ తర్వాత మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడం. ఎప్పుడైతే జగన్ సొంతంగా ప్రెస్ మీట్లలో మాట్లాడి మీడియా అడిగే వాటికి క్లియర్ కట్‌గా సమాధానాలు ఇవ్వగలుగుతారో అప్పుడే ప్రజలకు ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అనే నమ్మకం కలుగుతుంది. లేదంటే ఎప్పటిలాగే ట్రోల్స్ వస్తూ ఉంటాయి.