Vivek Ramaswamy: హిందువులు అమెరికా అధ్యక్ష పదవికి అనర్హులా?
Vivek Ramaswamy: రాజకీయాల్లో ప్రాంతీయ నాయకులకు ఉండే బలం ఇతర రాష్ట్రాల వారికి ఉండదు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ నాయకులనే ఎన్నుకుంటాం. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. ఇప్పుడు సడెన్‌గా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏమీ లేదండీ.. మన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఆయన అమెరికాలో సెటిల్ అయినప్పటికీ భారతీయుడు కావడంతో ఆయనకు పోటీ చేసే హక్కు.. గెలిచే అవకాశం ఉందా అనే ప్రశ్నలు అగ్రరాజ్యంలో మొదలయ్యాయి.
ఓ అంతర్జాతీయ మీడియా టౌన్ హాల్‌లో లక్షలాది మంది ముందు యాంకర్ వివేక్ రామస్వామిని ఈ ప్రశ్న వేసింది. “” మీరు హిందూ కదా..? మీ ధర్మం వేరు మా ధర్మం వేరు. మీ మతం వేరు. మాది వేరు. మనవి రెండూ ఒకటి కావు. అలాంటిది మీరు ఇక్కడ ఎలా పోటీ చేద్దామనుకుంటున్నారు? “” అని అందరి ముందు వివేక్‌ని ప్రశ్నించింది. మన వివేక్ మౌనంగా కూర్చోలేదు. యాంకర్‌కు ధీటుగా సమాధానం చెప్పి మన భారతీయ సత్తాను చూపించారు.
“” మీరన్నట్లు నేను హిందూనే. నేనేమీ నా గుర్తింపుని దాచుకోవడంలేదు. హిందూ, క్రైస్తవ మతంలోని విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి. నా సిద్ధాంతం ఒక్కటే. ఇక్కడ అందరూ ఏదో ఒక లక్ష్యంతో భూమి పైకి వచ్చారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మన నైతిక విలువ. ఎందుకంటే దైవం మనలాంటి మనుషుల ద్వారానే ఇతరులకు సాయం చేస్తుంటారు. మన ద్వారానే వివిధ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటాడు. ఆ విషయంలో మనమంతా సమానమే. నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోయి దేశం అంతటా క్రైస్తవ ధర్మాన్ని బోధించాలని అనుకోవడంలేదు. కానీ నేను అధ్యక్షుడిని అయితే మాత్రం అమెరికా ఏ విలువలపై పుట్టిందో ఆ విలువలను కాపాడతానని మాత్రం కచ్చితంగా చెప్పగలను“” అని సమాధానం ఇచ్చారు వివేక్.
కేరళకు చెందిన వివేక్ తల్లిదండ్రులు 37 ఏళ్ల క్రితమే అమెరికాలోని ఒహాయోలో స్థిరపడ్డారు. వివేక్ ఒహాయోలోనే పుట్టి పెరిగారు. తనకు అమెరికా విలువలు, బాధ్యతలు అన్నీ క్లుప్తంగా తెలుసు కాబట్టే ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5న జరగనున్నాయి.