Telangana Elections: KCR ఓటమి.. ఊహాగానమా? వాస్తవమా?
Telangana Elections: ఎన్నికలంటే పలు పార్టీ నుంచి అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. ఓటు మన తలరాతను మారుస్తది. మీ తలరాత మీ చేతిలోనే ఉంది. ఆగం కాకండి. ఆలోచించి ఓటెయ్యండి. ఎవరొస్తే రాష్ట్రం పరిస్థితి ఎట్లుంటదో తెలుసుకుని వేయండి అని గొంతు చించుకుని KCR ప్రజలకు చెప్పారు. ఈరోజు తెలంగాణలో పోలింగ్ ముగిసింది. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ హవా మొదలైపోయింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ (exit polls) గెలుపు కాంగ్రెస్‌దే (congress) అంటున్నాయి. అంటే KCR ఓటమి ఖాయమైందా? లేక ఊహాగానాలేనా?
ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఓటర్ల నుంచి తీసుకునే సర్వే ద్వారా వెలువడిన ఫలితాలు మాత్రమే. ఆ ఫలితాలు నిజమా కాదా అని కచ్చితంగా చెప్పలేం. ప్రజలకు ఒక విశ్లేషణ ఇచ్చినట్లుగా ఉంటుంది అని కొన్ని సర్వేలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేస్తుంటాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అబద్ధాలని ఇప్పటికే KTR కూడా అన్నారు. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని కానీ ఏం జరిగిందో యావత్ భారతదేశం చూసిందని అన్నారు. ఈసారి కూడా 70కి పైగా సీట్లు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే?
ఒకవేళ ఇప్పుడు వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ నిజమే అయితే తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనడానికి ఏ సందేహం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి స్థానం ఎవరికి దక్కనుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. పార్టీ గెలిస్తే సీఎం KCR అనడంలో సందేహం లేదు. మరి కాంగ్రెస్ గెలిస్తే ఆ హాట్ సీట్ ఎవరి సొంతం అవుతుంది? కనీసం సీఎం అభ్యర్ధి లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచి ఏం మంచి చేస్తది అని KTR కూడా సెటైర్ వేసారు.
తెలంగాణ మొత్తానికి నేనే కాంగ్రెస్ అభ్యర్ధిని: రేవంత్ రెడ్డి
మరో పక్క రేవంత్ రెడ్డి (revanth reddy) సొంత డప్పు కొట్టుకోవడం ఇంకా మానలేదు. ఇప్పటికే ఆయన సీఎం పదవిపై కన్నేసారు. కచ్చితంగా కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్ అయిన తనకే సీఎం పదవి కట్టబెడుతుందని ఆశిస్తున్నారు. పైగా ఈరోజు ఓటు వెయ్యడానికి వెళ్తూ రేవంత్ ఒక మాస్ డైలాగ్ కొట్టారు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక కాంగ్రెస్ అభ్యర్ధిని తానేనని పరోక్షంగా కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవి తనదేనని చెప్పకనే చెప్పారు.
మూడోసారి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం
మరోపక్క మూడోసారి తానే సీఎం అవుతానని ధీమాగా ఉన్న KCR.. ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రగతి భవన్‌ను అలంకరిస్తున్నారు. పూజారులను అడిగి సరైన ముహూర్తం ఖరారు చేయించుకున్నారట. అంతేకాదు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసాక తొలి సంతకం అసైన్డ్ భూములకు సంబంధించిన ఫైల్‌పై పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక అసలైన ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.