YS Sharmila కోసం కాంగ్రెస్‌ వెయిటింగా? అంత సీన్‌ ఉందా?

Hyderabad: YSRT అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (ys sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరతారని లేదా పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) ముందుకు వెళ్తారని వార్తలు వచ్చాయి. AP కాంగ్రెస్‌ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని కథనాలు ప్రచురించారు. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పుకొచ్చారు. కానీ ఇందులో ఏది వాస్తవం? అసలు షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీకి వ‌చ్చే లాభమేంటి? ఏపీలో ఎంట్రీ ఇచ్చినా.. వైఎస్‌ జగన్‌ను (ys jagan) ఎదిరించి షర్మిల బరిలో నిలుస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

వైఎస్ షర్మిల ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక జగన్‌ జైలులో ఉన్నప్పుడు.. బస్సు యాత్ర చేపట్టిన షర్మిల.. తన వాక్‌చాతుర్యంతో అందరికి చేరువయ్యారు. జగన్‌ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ వివాదాల కారణంగా.. షర్మిల దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ పెట్టి.. కేసీఆర్ (kcr) సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా.. కర్నాటక ఫలితాల తర్వాత ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను షర్మిల కలిశారు. ఈ క్రమంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తుందని, పొత్తు పెట్టుకుంటారు అనే వార్తలు వచ్చాయి. కానీ.. ఇదంతా వాస్తవం కాదని షర్మిల ఇటీవల తెలిపారు.

ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నందునే డీకేను కలిశానన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ ఇటీవల షర్మిలతో ఫోన్‌లో మాట్లాడారని వార్తలు వస్తుండగా.. అది వాస్తవం కాదని పలువురు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. షర్మిలతో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం రాదని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..షర్మిల ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎక్కడా గెలవలేదు. ఈనేపథ్యంలో షర్మిల కోసం కాంగ్రెస్‌ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో షర్మిల బలం ఎంత అనేది ఇతర పార్టీలతోపాటు… ఆమె కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.