Indira Gandhi: బొప్పాయి కావాల‌న్న ఇందిర‌.. భ‌యంతో వ‌ణికిపోయిన సిబ్బంది

Indira Gandhi: దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ బొప్పాయి కావాల‌ని అడ‌గంతో తాజ్ హోట‌ల్‌లోని సిబ్బంది అంతా భ‌యంతో వ‌ణికిపోయార‌ట‌. ఇంతోటి బొప్పాయి ఇవ్వ‌డానికి వ‌ణికిపోవాల్సిన అవ‌స‌రం ఏముంది అనుకుంటున్నారా? మ‌రి ఆవిడ అడిగింది అల్లాట‌ప్పా బొప్పాయి కాదు. తాజాగా ఎలాంటి కెమిక‌ల్స్ వాడ‌ని బాగా పండిన బొప్పాయి. ఆ స‌మ‌యంలో గోవాలో ఇందిర అడిగిన బొప్పాయిలు దొర‌క‌డం చాలా క‌ష్టం. అయినా కూడా ఆమె వినిపించుకోలేదు. అలాంటి బొప్పాయిల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లోకి కావాల‌ని డిమాండ్ చేసారు.

ఇప్పుడు ఉన్న‌ట్టుండి ఇందిరా గాంధీ బొప్పాయి క‌థ ఎందుకొచ్చిందంటే.. గోవాలోని ప్ర‌ముఖ తాజ్ హోట‌ల్‌లో చెఫ్‌గా ప‌నిచేసిన స‌తీష్ అరోరా అనే వ్య‌క్తి తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్ట‌ర్స్ : టేల్స్ ఫ్రం ఎ చెఫ్స్ లైఫ్ అనే బుక్‌లో ఈ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అది 1983. గోవాలో కామ‌న్‌వెల్త్ హెడ్స్ ఆఫ్ గ‌వర్న‌మెంట్ మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యం అది. దాదాపు రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ మీటింగ్‌లో 48 దేశాల‌కు చెందిన అగ్ర నేత‌లు హాజ‌రయ్యారు. (indira gandhi)

ఆ స‌మ‌యంలో ఇందిర త‌న‌కు బాగా పండిన బొప్పాయిలు బ్రేక్‌ఫాస్ట్‌లోకి కావాల‌ని అడిగారు. దాంతో స‌తీష్ అరోరాకు చేతులు వ‌ణికాయి. ఎందుకంటే ఆ స‌మ‌యంలో అస‌లు గోవాలో బొప్పాయిలు దొర‌క‌డంలేదు. ఇక చేసేదేమీ లేక ఒక ప్ర‌భుత్వం వాహ‌నంలో ఎక్కి సైర‌న్ మోగించుకుంటూ గోవాలోనే ఉన్న ఓ గ్రామానికి వెళ్లి మ‌రీ దాదాపు 12 బొప్పాయిలు తీసుకొచ్చాడ‌ట‌. అయితే ఆ బొప్పాయిల‌తో హోట‌ల్ లోప‌లికి వెళ్ల‌డానికి వీల్లేద‌ని పోలీసులు అడ్డుకున్నారు.

దాదాపు గంట సేపు వేడుకుంటే అప్పుడు బొప్పాయిల‌న్నీ క‌ట్ చేసి అందులో పేలుడు ప‌దార్థాలు వంటివి లేవ‌ని ధృవీక‌రించుకున్నాక అప్పుడు లోప‌లికి అనుమ‌తించార‌ట‌. అలా ఇందిరా గాంధీ అడిగిన బొప్పాయిల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వ‌గ‌లిగామ‌ని స‌తీష్ అరోరా తెలిపారు. ఆ స‌మ‌యంలో తాను ప‌డిన టెన్ష‌న్ గుర్తుతెచ్చుకుంటే ఇప్ప‌టికీ ఒక ర‌క‌మైన భ‌యం క‌లుగుతుంద‌ని అంటున్నారు. (indira gandhi)