Russia Ukraine: భారత ఆయుధాలు ఉక్రెయిన్‌కు.. క్రెమ్లిన్ గుర్రు
Russia Ukraine: చాలా కాలంగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలు రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణులతో దాడి చేస్తుండగా.. మరికొన్ని రోజులు ఉక్రెయిన్ రష్యాపై సైలెంట్ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు ఉక్రెయిన్‌కు పర్యటించారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యారు. తాను ఎవరి పక్షాన నిలవడం లేదని.. కేవలం శాంతికి మాత్రమే తాను మద్దతు ఇస్తానని తెలిపారు. ఇరు దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు తనకు తోచిన సాయం చేస్తానని మాటిచ్చారు.
ఇదిలా ఉండగా.. మనకు మిత్రదేశం అయిన రష్యాకు భారత్ షాకిచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలను సరఫరా చేయొద్దని కోరినప్పటికీ ఉక్రెయిన్‌కు భారత్ సాయం చేసింది. భారతీయ ఆయుధాల తయారీదారులు తయారు చేసిన ఆర్టిలరీ షెల్స్‌ను యూరోపియన్ దేశాలకు పంపాల్సి ఉండగా.. అవి కాస్తా ఉక్రెయిన్‌కు మళ్లాయి. ఆ ఆర్టిలరీ షెల్స్‌తోనే ఉక్రెయిన్ రష్యాపై దాడులకు పాల్పడుతోంది. ఇలా దాదాపు ఏడాదిగా జరుగుతోందట. ఇదే విషయాన్ని జులైలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ క్రెమ్లిన్‌తో సమావేశమైనప్పుడు చర్చించారు. క్రెమ్లిన్ వద్దు అని అభ్యర్ధించినప్పటికీ ఇంకా భారత్ ఈ షెల్స్‌ను ఉక్రెయిన్‌కు మళ్లిస్తోంది.
Russia Ukraine: దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ కేవలం 1 శాతం ఆయుధాలు మాత్రమే ఉక్రెయిన్‌కు భారత్ నుంచి వెళ్తున్నాయని సమర్ధించుకుంది. కొన్నేళ్లుగా భారత్ నుంచి ఎగుమతయ్యే ఆయుధాల సంఖ్య పెరిగింది. ఈ ఆయుధాలను ఇటలీ, చెక్ రిపబ్లిక్ దేశాలకు పంపుతుండగా.. అక్కడి నుంచి వాటిని ఉక్రెయిన్‌కు మళ్లిస్తున్నారు. ఈ దేశాలకు చెందిన కొన్ని ఆయుధాల తయారీ కంపెనీలు భారత్ నుంచి ఖాళీ షెల్స్ కొనుగోలు చేసి వాటిలో పేలుడు పదార్థాలు పెట్టి మరీ ఉక్రెయిన్‌కు తరలిస్తోంది.
మామూలుగా అయితే భారత్‌కు అత్యధిక సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేసేదే రష్యా. కానీ ఇప్పటివరకు రష్యా భారత్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలను విధించలేదు. కాకపోతే ఇప్పుడు భారత్ కూడా సొంతంగా ఆయుధాలను తయారుచేసుకుంటోంది కాబట్టి ఉక్రెయిన్‌కు జరుగుతున్న మళ్లింపులకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. గతేడాది మాత్రం భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది. 2029 నాటికి ఇది కాస్తా 6 బిలియన్ డాలర్లకు చేరుతుంది. యూరప్‌లో జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ నుంచి ఆయుధాల ఎగుమతి పెరిగింది. ఇది ఒక రకంగా భారత్‌కు కలిసొచ్చే అంశం అయినప్పటికీ క్రెమ్లిన్ మాత్రం భారత్‌పై కాస్త గుర్రుగా ఉంది.
రష్యా మిత్ర దేశం అయినప్పటికీ పశ్చిమ దేశాలు.. అతి ముఖ్యంగా అమెరికాతో భారత్ రక్షణ, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ నేపథ్యంలో అటు రష్యాతో కానీ ఇటు పశ్చిమ దేశాలతో కానీ మెరుగైన సత్సంబంధాలు ఉండేలా జాగ్రత్త పడుతోంది. పైగా రష్యాపై యుద్ధంలో గెలిచేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయంగా నిలుస్తున్నాయి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఉక్రెయిన్‌కు మళ్లుతున్న ఆయుధాలపై కేంద్రం ఏమంటుందో చూడాలి.