AP Elections: ఈ గ్రామంలో రెండు సార్లు ఓటు వేస్తారు.. ఎందుకో తెలుసా?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. సాధారణంగా ఓటు అనేది ఒకసారే వినియోగించుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం రెండు సార్లు వినియోగించుకుంటారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలు రెండు సార్లు అందుకుంటారు. ఈ ప్రాంతం విశేషాలేంటో తెలుసుకుందాం.
ఆ ప్రాంతం పేరు కోటియా. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకు మధ్యలో ఉంది. ఇక్కడ నివసించేవారికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓటర్ ఐడీలతో పాటు ఒడిశా ఓటర్ ఐడీలు కూడా ఉంటాయి. ఓటర్ ఐడీలే కాదు రేషన్ కార్డులు, పెన్షన్ క ఆర్డులు కూడా రెండు రాష్ట్రాలకు చెందినవి ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను అందుకుంటున్నారు.
ఈ కోటియా ప్రాంతం రెండు లోక్ సభ నియోజకవర్గాల మధ్యలో ఉంది. ఒకటి అరకు మరొకటి ఓడిశాలోని కోరాపుట్. ప్రముఖ నటుడు నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డినరీలో కోటియా ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది అని చూపించడం వివాదాస్పదంగా మారింది. 1968లో కోటియా తమ ప్రాంతం అంటూ ఒడిశా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించలేదు. బోర్డర్ సమస్యలు ఉన్న ప్రాంతాల విషయంలో కోర్టులు కలగజేసుకోవు అని తేల్చి చెప్పింది.
అదే విధంగా కోటియాను ఏ రాష్ట్రం కూడా తమది అని ప్రకటించుకోవడానికి వీల్లేదని కూడా తేల్చి చెప్పడంతో ఆ ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు కోటియా ప్రాంతానికి చెందిన 28 గ్రామాలను మన్యం జిల్లాలోని పార్వతిపురంలో కలిపినట్లు చూపించారు.
అంతేకాదు.. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు స్థానిక గ్రామాలను కూడా తమ భాషలో అర్థమయ్యేలా పలుకుతారు. ఉదాహరణకు.. గంజేయ్పాదర్ అనే గ్రామాన్ని ఆంధ్రలో గంజాయిభద్ర అని, ఆంధ్రలోని నేరళ్ల వలస పేరును ఒడిశాలో నేరదబాల్సా అని పలుకుతుంటారు. దానిని ఎలా పలికినా కూడా అక్కడి వారు అభ్యంతరం తెలపరు.
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలా అని సతమతమవుతున్నారు. కొందరు ఓటర్లేమో ఏపీ ఎన్నికల్లో తాము ఓటేస్తామని.. ఇక్కడి రాష్ట్రం నుంచి పథకాలు ఎక్కువగా అందుతున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోటియా ఓటర్లకు రూ.3000 పెన్షన్ వస్తుండగా.. ఒడిశా నుంచి కేవలం రూ.500 మాత్రమే వస్తోంది.