Tirumala Laddoo: తిరుమల లడ్డూలో హెరిటేజ్ నెయ్యి
Tirumala Laddoo: తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లడ్డూలో వాడ నెయ్యి కల్తీదని.. అందులో చేప నూనె, జంతువుల కొవ్వు కలిపినట్లు గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులలో తేలిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ కల్తీ నెయ్యితోనే లడ్లు తయారు చేసారని ఆరోపించారు. దాంతో జగన్ దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతూ నిన్న ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు.
ఈ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఓ షాకింగ్ అంశాన్ని లేవనెత్తారు. శ్రీవారి లడ్డూ తయారీ కోసం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ నెయ్యిని అమ్మినట్లు అనుమానంగా ఉందని అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోయి చాలా కంపెనీలు నష్టాలు చూస్తే.. హెరిటేజ్ ఫుల్స్ కంపెనీకి మాత్రం రూ.1200 కోట్ల లాభాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అదీకాకుండా చంద్రబాబు నాయుడుకి తెలిసిన గుజరాత్‌లోని ప్రైవేట్ ల్యాబ్‌లో మాత్రమే లడ్డూలోని నెయ్యి నాణ్యతను ఎందుకు పరీక్షించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ అడ్డా అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎన్ని తప్పుడు ఆరోపణలైనా చేసే అవకాశం ఉందని అన్నారు.