Jagan స్టిక్కర్ల అంశంలో దిగజారిపోయారా? ఓ మెట్టు ఎక్కారా?

vijayawada: ఏపీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా.. ఏపీలో మాత్రం రాజకీయా(ap politics)లు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. కొన్ని రోజుల కిందట సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ap cm ys jagan mohan reddy) ఇంటింటికీ వెళ్లి ‘నువ్వే మా నమ్మకం జగన్‌.. నువ్వే మా భవిష్యత్తు’ అనే పేరుతో రూపొందించిన స్టిక్కర్లను ప్రజల ఇళ్ల గోడలకు, సెల్‌ఫోన్లకు అంటించాలని నాయకులకు ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేల దగ్గరి నుంచి.. పార్టీ కీలక నాయకులు అందరూ.. వారివారి పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి స్టిక్కర్‌ అంటించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల జగన్‌కు వచ్చే లబ్ధి ఏంటి? దీనివల్ల ఆయనకు నష్టమా లాభమా అన్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవంగా సీఎం జగన్‌ ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేసి 151 సీట్లను కైవసం చేసుకున్నారు. ఇంత మెజార్టీతో గెలుపొందడం ఒక ఎత్తయితే.. ఎమ్మెల్యేలను, ప్రజల్ని సంతృప్తి పరచడం కొంచెం కష్టమైన పని. అయినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. నాయకులు, జనాన్ని కొంతవరకు సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలతో కూడా గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని చెప్పి.. సమస్యలు, పథకాలు అందుతున్న తీరును తెలుసుకోవాలని జగన్‌ సూచించారు. ఇదీ జరుగుతోంది. మరి ఇవన్నీ ఉండగా.. మళ్లీ వేల కోట్లు ఖర్చుచేసి స్టిక్కర్లు అంటించడం విచిత్రంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రజలు ఎవరు ఏది చేస్తున్నారు అనేది గమనిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఏం జరిగింది.. వైసీపీ వచ్చాక ఏం జరిగింది అనే విషయాలను జగన్‌ బహిరంగ సభల్లో చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఇది సరిపోతుంది కదా.. పథకాలకు సంబంధించి ప్రకటలు ఇవ్వడం, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం చేయడం.. ప్రచారానికే అధికంగా ప్రజాధనం వెచ్చించడం అవసరమా అని కొందరి వాదన. జగన్‌ మాత్రం ఇది ఓ రకమైన ఎన్నికల సర్వేగా భావిస్తున్నారని అందుకే తీసుకొచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.