Telangana Assembly: అసెంబ్లీలో “జగన్”.. రచ్చ రచ్చే..!
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయనకేం పని అనుకుంటున్నారా? తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి చూపించారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రసంగాన్ని ప్లే చేసారు. ఆ ప్రసంగంలో జగన్ మాట్లాడుతూ.. నీళ్లు లేక ఆంధ్రప్రదేశ్ ఇబ్బందిపడుతోందని తాను KCRను కోరితే ఆయన తన ముందు వెనక ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్రంలోని నీటిని తమకు పంచారని అన్నారు. దాంతో ఒక్కసారిగా అసెంబ్లీ దద్దరిల్లింది. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన ఉద్దేశం వేరని.. దానిని వీలుగా చేసుకుని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని BRS నేతలు ఒక్కసారిగా కేకలు వేసారు. (Telangana Assembly)
హరీష్ రావు మాట్లాడుతుండగా వెంకటరెడ్డి అత్యుత్సాహం
ఆ తర్వాత హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వగా.. కాంగ్రెస్ తమపై చేస్తున్నవన్నీ ఆరోపణలే అని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించిన అసెంబ్లీ తమకు కూడా తమ సైడ్ నుంచి నిజాలను బయటపెట్టే అవకాశం ఇవ్వాలని.. అప్పుడే ప్రజలకు మంచి ఎవరు చేసారో చెడు ఎవరు చేసారో తెలుస్తుందని హరీష్ రావు అన్నారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. పరిశీలించి అవకాశం ఇస్తామని గతంలోనే చెప్పానని మళ్లీ ఈ విషయం గురించి ప్రస్తావించడం అనవసరం అని అన్నారు.
ఆ తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ.. రేపు నల్గొండలో KCR సభ నిర్వహించనున్నారు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించం అని ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తెలంగాణ ప్రజల, BRS పార్టీ విజయం అని అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. ఏ ముఖం పెట్టుకుని KCR నల్గొండకు వస్తారు? ఆయన నల్గొండలో అడుగుపెట్టే ముందు ముక్కు నేలకు రాసి రావాలి లేదంటే చెప్పుతో కొడతాం అని రెచ్చిపోయారు. దాంతో ఒక్కసారిగా అసెంబ్లీ దద్దరిల్లింది.
వెంటనే హరీష్ రావు స్పందిస్తూ.. వెంకట రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని చెప్పుతో కొడతాం అనకూడదని.. వెంటనే క్షమాపణలు చెప్పాలి లేదంటే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని అప్పుడే తాను ప్రసంగించడం మొదలుపెడతానని హరీష్ రావు పట్టబుట్టారు. ఇక చేసేదేం లేక స్పీకర్ వెంకటరెడ్డి అన్న మాటలను డిలీట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఆ తర్వాత హరీష్ రావు కాస్త శాంతించి ప్రసంగం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాస్తవాలు అనే పుస్తకానికి బదులు అవాస్తవాలు అని పెడితే బాగుండేదని.. వారిలాగా ప్రిపేర్ అవ్వలేదని మధ్యలో వెళ్లిపోకుండా అన్నింటికీ సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు అన్నారు. ఆ మాటకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి చెప్పండి అని అంటుండగా.. చెప్తాం అన్నా.. నీకు బీపీ ఎక్కువైనట్లుంది బయటికి పోయి గోలీ ఏస్కోపో అని సెటైర్ వేసారు. దానికి వారు రచ్చ చేయగా.. మరి KCRను చెప్పుతో కొడతాం అన్నప్పుడు ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించారు.
ఇలా వాదోపవాదాల మధ్య అసెంబ్లీలో రచ్చ రాజుకుంది. కానీ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ఎంట్రీ మాత్రం ఈరోజు హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి.