జగన్‌కు తొలి పరీక్ష
Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఓటమి తర్వాత తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈరోజు నుంచే విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 14న నామినేషన్లను పరిశీలిస్తారు. 16 తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్.. సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపికచేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు టికెట్లు ఇస్తే ఆ ఐదులోనూ బొత్స, అతని కుటుంబ సభ్యులు ఓడిపోయారు. అయినప్పటికీ జగన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బొత్సనే ఎంపికచేసారు. ఈ ఎన్నికలో మొత్తం ఓటర్ల సంఖ్య 838 కాగా.. అందులో మెజారిటీ ఓట్లు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత వంశీ కృష్ణయాదవ్‌కే పడ్డాయి. ఆయన ఇటీవల జనసేనలో చేరడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది.
అయితే.. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. అక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్ధిని నిలబెడతారు అనే ఆసక్తి సర్వత్రా ఉంది. ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోని జగన్‌కు ఇది కీలక పరీక్ష. ఈ ఉప ఎన్నికలో జగన్ పార్టీ గెలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆశలు సజీవంగా ఉంటాయి. అదే ఓడిపోతే మాత్రం.. ఇక మూట ముల్లె సర్దుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.