KTR చేసిన ప‌నికి చిక్కుల్లో కుమారుడు?!

False Statements in KTR Affidavit

KTR: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప‌నికి ఆయ‌న కుమారుడు హిమాన్షు చిక్కుల్లో ప‌డ్డారు. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆయ‌న కుమారుడు కేటీఆర్‌కు బ్యాక్ టు బ్యాక్ షాక్స్ త‌గులుతున్నాయి. ప‌దేళ్ల పాటు సెంటిమెంట్ పాలిటిక్స్‌తో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌కు రాష్ట్రంలో మూడోసారి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు సెంటిమెంట్ అడ్డం తిరిగింది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అదృష్టం ప‌రీక్షించుకుందాం అంటే ఆ ఎన్నిక‌ల ముందే క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క‌ల్వకుంట్ల క‌విత అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు వెళ్లారు. ఆమెను అరెస్ట్ చేసి కేంద్రం త‌మ‌ను టార్గెట్ చేస్తోంద‌ని లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ వారు గ‌గ్గోలు పెట్టి మ‌ళ్లీ సెంటిమెంట్ పండించాల‌ని చూసినా ఉప‌యోగం లేకుండాపోయింది. స‌గం ఎంపీ సీట్ల‌లో ఓట‌ర్లు డిపాజిట్లు గ‌ల్లంతు చేసి పార్టీ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మాట్లాడ‌టానికి కూడా ముఖం చెల్ల‌క ఫాం హౌజ్‌కే ప‌రిమితం అయిపోయారు మాజీ సీఎం.

ఇక తాజాగా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అఫిడ‌విట్ చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. దాంతో ఆ ఫ్యామిలీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ఒక‌వైపు ఎన్నిక‌ల్లో వ‌రుస ఓట‌ములు మ‌రోవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతార‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు కేటీఆర్. అది చాల‌ద‌న్న‌ట్లు ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో చూపించిన ఆస్తుల వివ‌రాలు అబ‌ద్ధాల‌ని హైకోర్టులో కేసు న‌మోదైంది.

నాలుగు వారాల్లో కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఈఓ సిరిసిల్ల రిట‌ర్న్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో కేసీఆర్ కేటీఆర్ హైరానా ప‌డిపోతున్నారు. త‌న కుమారుడు హిమాన్షు పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు కేటీఆర్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేటీఆర్ ఫాం హౌస్ కొడుకు హిమాన్షు పేరు మీదే ఉంద‌ట‌.

హిమాన్షు పేరు మీద విదేశాల్లో కూడా ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో హిమాన్షు త‌న‌పై ఆధార‌ప‌డి లేడ‌ని కేటీఆర్ తెలిపారు. దానిని ఫోక‌స్ చేస్తూ ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్ల‌ద‌ని కాంగ్రెస్ అభ్య‌ర్ధి మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు శ్రీనివాసులు అనే మ‌రో వ్య‌క్తి విడి విడిగా పిటిష‌న్ దాఖ‌లు చేసారు. హైకోర్టు జ‌స్టిస్ రాజేశ్వ‌ర‌రావు ఈ పిటిష‌న్‌ను విచారించారు.

కేసులో ప్ర‌తివాదులు అయిన కేటీఆర్ రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్, రిట‌ర్నింగ్ అధికారి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేటీఆర్ దాఖ‌లు చేసిన ఎల‌క్ష‌న్ అఫిడ‌విట్లు ఆయ‌న కొడుకు హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వ‌చ్చాయో చెప్ప‌లేద‌ని పిటిష‌నర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. త‌న‌పై భార్య, మైన‌ర్ కుమార్తె మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉన్నార‌ని.. హిమాన్షు ఆధార‌ప‌డి లేడ‌ని పేర్కొన్నారు.

గ‌తేడాది జులైలో మేజ‌ర్ అయిన హిమాన్షు త‌న‌పై ఆధార‌ప‌డి లేర‌న‌డంతో సిద్ధిపేట జిల్లాలోని వెంక‌టాపూర్‌లో నాలుగు ఎక‌రాలు, ఎర్ర‌వ‌ల్లిలో 32.15 ఎక‌రాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు వ‌రుస‌గా 10.50 ల‌క్ష‌లు.. 88.15 ల‌క్ష‌లు చెల్లించార‌ని గ‌తేడాది మేజ‌ర్ అయిన అత‌నికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డ‌బ్బు ఎలా సంపాదించాడని పిటిష‌నర్లు ప్ర‌శ్నించారు.

అఫిడ‌విట్‌లో నిజాలు దాచిన కేటీఆర్‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించారని కోరారు. వాద‌న‌ల అనంత‌రం ప్ర‌తివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయ‌మూర్తి త‌దుప‌రి విచార‌ణను నాలుగు వారాలకు వాయిదా వేసారు. బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌పై వివ‌ర‌ణ కోరుతూ ఇప్ప‌టికే కేసీఆర్‌కు ప‌వ‌ర్ క‌మిష‌న్ నోటీసులు ఇవ్వ‌గా.. తాజాగా కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.