Jagadish Shettar: కాంగ్రెస్‌ గూటికి.. ఎన్నికల ముందు BJPకి దెబ్బ

Bengaluru: కర్నాటక రాష్ట్రంలో ఎన్నికలు(karnataka elections) సమీపిస్తున్న కొద్దీ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా అధికార BJP నుంచి వలసల ప్రభావం అధికంగా ఉంది. కర్నాటక రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సామాజిక వర్గం లింగయాత్‌లు. ఈ సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం జగదీష్ షెట్టార్( Jagdish Shettar) సోమవారం ఉదయం కాంగ్రెస్(Congress) కండువ కప్పుకున్నారు. బీజేపీ పార్టీలో ఈయనకు సీటు దక్కకపోవడంతో.. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు షెట్టారు చెబుతున్నారు. ఇవాళ ఉదయం బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల ఆధ్వర్యంలో షెట్టార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఇక షెట్టార్ చేరికతో కాంగ్రెస్‌ మరింత బలోపేతం కానుందని.. ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. షెట్టార్‌తోపాటు.. సీనియర్ బీజేపీ నాయకుడు అమర్ సింగ్ పాటిల్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ ఎన్నికల్లో కొన్ని ప్రయోగాత్మక, ఛాలెంజింగ్‌ నిర్ణయాలను తీసుకున్న బీజేపీకి పార్టీ సీనియర్లు, సీట్లు దక్కని వారి నుంచి తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తులు సవాలుగా మారాయి. కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో వెళ్తున్నారు. ఈక్రమంలో బీజేపీ కీలక నేత.. పార్టీకి తొలి నుంచి అండగా ఉన్న నాయకుడు జగదీష్‌ షెట్టార్‌ బీజేపీకి వీడటం ఆ పార్టీకి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్బంగా షెట్టార్‌ మాట్లాడుతూ.. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని.. ఏడోసారి కూడా ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. సీనియర్ నాయకుడైన తనకు బీజేపీలో టికెట్ రాకపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని.. తనను బీజేపీ నేతలు ఎవరూ కలవలేదని చెప్పారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సూర్జేవాలా, ఎంబీపాటిల్ ను సంప్రదించానని వారి ఆహ్వానం మేరకు.. కాంగ్రెస్ పార్టీలో చేరానని జగదీష్ చెప్పారు.