Duvvada Srinivas: భరించేవాడే భర్త.. అన్నీ భరించాను
Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రట్టవ్వడంతో ఆయన తలెత్తుకోలేకపోతున్నారు. తన భార్య వాణి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. భరించేవాడే భర్త కాబట్టి అన్నీ భరించానని ఇక తనకు ఓపిక లేదని విడాకులకు అప్లై చేస్తానని తెలిపారు. తను వ్యాపారం పెట్టినా.. రాజకీయంగా ఎదిగినా ఎందులో అయితే లాభం ఉంటుందో అవన్నీ తన పేరు మీద ఉండాలని వాణి టార్చర్ పెట్టిందని.. ఎందులో అయితే లాస్ వస్తుందో వాటిని మాత్రం పట్టించుకోదని తెలిపారు.
ఇవన్నీ తాను రెండేళ్లుగా అనుభవిస్తున్నానని.. కానీ ఇంటి సమస్యలు నాలుగు గోడల మధ్య ఉండాలని తానెప్పుడూ ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేదని తెలిపారు. కానీ ఈరోజు తన ఇంటి సమస్య వీధికి వచ్చింది కాబట్టి ప్రజలకు సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకొచ్చానని అన్నారు. తన భార్య వాణి వల్ల కన్నతల్లిని కూడా 30 ఏళ్లుగా ఇంటికి పిలిపించి మాట్లాడింది లేదని.. ఒకవేళ తాను తన తల్లి వద్దకు వెళ్లి వచ్చినట్లు తెలిస్తే కొన్ని రోజుల వరకు ఇంట్లో తిండి పెట్టేది కాదని అన్నారు. అసలు ఇప్పటికీ తన తప్పు ఏంటో ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నానో తెలీడంలేదని అన్నారు. తన ప్రాణాలకు రక్షణ లేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో టికెట్ తనకు ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి అంటే.. టికెట్ నాకు కావాలి అంటూ వాణి పట్టుబట్టిందని.. దాంతో జగన్‌తో మాట్లాడి టికెట్ వదులుకున్నానని అన్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోవడంతో మళ్లీ జగన్ తనను పిలిపించి టికెట్ తనకు ఇవ్వడం జరిగిందని అన్నారు. తన కూతుళ్లకు కన్నతండ్రి గురించి తప్పుగా చెప్పి వారి బుర్రల్లో విషం నింపిన వాణితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.