Rahul: విద్యార్థులతో కలిసి భోజనం… వెంటనే నోటీసులు!
Delhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi)కి అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోదీ(Pm modi) పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను.. కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా… గత వారం ఢిల్లీ యూనివర్సిటీలోని(delhi university) పీజీ మెన్స్ హాస్టల్ ని రాహుల్ సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అనుమతి లేకుండా హాస్టల్ లోకి వెళ్లడంతో నిబంధనలు అతిక్రమించారని యూనివర్సిటీ అధికారులు ఆయనకు నోటీసులు పంపారు.
రాహుల్‌కు పంపిన నోటీసుల్లో ఆయన హాస్టల్ లోకి రావడం నిబంధనలను అతిక్రమించడమే అని అధికారులు పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్య ప్రవర్తన కిందకి వస్తుందని అన్నారు. రాహుల్ మూడు వాహనాలతో హాస్టల్‌లోకి వచ్చారని.. ఇది కూడా నిబంధనలు అతిక్రమించడమేనని తెలిపారు. కళాశాలలో చదువుకునే వ్యక్తులు మినహా.. ఇంకెవ్వరికీ.. హాస్టల్ లోకి ప్రవేశం ఉండదని చెప్పారు. హాస్టల్ నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఇతర సభ్యులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. అధికారుల అనుమతి లేనిది హాస్టల్ ని విజిట్ చేయడం సరికాదని రిజిస్ర్టార్ వికాస్ గుప్తా అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల భద్రతకు ప్రమాదంగా మారొచ్చని ఆయన పేర్కొన్నారు. అధికారులు పంపిన నోటీసులపై ఎన్ఎస్ యూఐ స్టూడెంట్ విభాగం ఖండించింది. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని అధికారుల మీద ఎవరో ఒత్తిడి తెస్తున్నారని ఆ విభాగం ఆరోపించింది.