ఎమ్మెల్సీ ఎన్నికలు వారు దూరంగా ఉంటే మంచిది: EC
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. అలా దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరందరూ పథకాలకు సంబంధించిన విషయాలతోపాటు.. వారి పరిధిలోని కుటుంబ వివరాలను కూడా సేకరిస్తుంటారు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా మాత్రం జరగుతుందని భావించనవసరం లేదు. అయితే.. ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాలంటీర్ల పాత్రపై విమర్శలూ పెరుగుతున్నాయి. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లను అధికార పార్టీ నాయకులు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే కొందరిని తొలగిస్తామని బెదిరింపులకు కూడా దిగుతున్నారని సమాచారం. ఇక ప్రతిపక్షాలు సైతం వాలంటీర్లు పార్టీ కార్యకర్తల్లా మారిపోతున్నారని పలుమార్లు బహిరంగంగా ఆరోపించిన సందర్బాలు లేకపోలేదు. తాజాగా ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి వాలంటీర్ల పనితీరుపై విమర్శలకు వేదికవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందే..
గ్రామ, వార్డు వాలంటీర్లను ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా పదే పదే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నాయి. అయితే… క్షేత్రస్ధాయిలో మాత్రం వాటిని అమలు చేయాల్సిన కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులు మాత్రం వాలంటీర్లను కట్టడి చేసేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే వారికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర స్థానిక నాయకుల అండదండలు ఉండటంతో.. వాలంటీర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు అయిపోయింది. ఈ కోణంలో కూడా ఆరోపణలు రావడంతో వాలంటీర్లపై మళ్లీ మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తగిన ఆధారాలతో విపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు మరోసారి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఈ మేరకు వారిని కట్టడి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా కలెక్టర్లకు మరోసారి లేఖలు రాశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని కోరారు. గతంలోని ఇలాంటి ఆదేశాలే ఇచ్చామని, కానీ అమలు కాకపోవడంతో మరోసారి ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు కలెక్టర్లకు మీనా తెలిపారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు ఈసీ ఇచ్చిన ఆదేశాలను వారు ఈసారైనా పాటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.