“ఏడ‌వ‌కండి మోదీజీ.. నా అన్న‌ను చూసి నేర్చుకోండి”

Delhi: కాంగ్రెస్(congress) పార్టీ త‌న‌ను 91 సార్లు ధూషించింది అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(narendra modi) అన్నారు. అయితే దీనికి కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ(priyanka gandhi) చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ధూషించినంత మాత్రాన ఏడుస్తూ కూర్చుంటే అవ్వ‌ద‌ని, త‌న అన్న‌ రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాల‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లోని బ‌గ‌ల్‌కోటే జిల్లాలో ప్రియాంక ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మేము మిమ్మ‌ల్ని అన్న‌మాటల‌న్నీ పోగేసుకోవ‌డానికి మీకు ఒక పేజీ ప‌ట్టింది. అదే మీరు మమ్మ‌ల్ని అన్న మాట‌ల‌న్నీ తీస్తే పుస్త‌కాలు నిండిపోతాయ్. రాజ‌కీయాల్లో ఇలా తిట్టుకోవ‌డం కామ‌నే. అవ‌న్నీ త‌ట్టుకోవాలి మ‌రి. అదే కదా రాజ‌కీయం అంటే. దానికే ఏడిస్తే ఎలా మోదీజీ. నా అన్న‌ను చూసి నేర్చుకోండి. వాడు దేశం కోసం బుల్లెట్ తీసుకోవ‌డానికైనా రెడీ. మా నాన‌మ్మ ఇందిరా గాంధీ, నాన్న రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ దేశం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. కానీ మోదీగారు మాత్రం ఆయ‌న్ని ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నారో లెక్క పెట్టుకుంటూ ప్రజ‌ల దగ్గ‌రికి వ‌చ్చి ఏడుస్తున్నారు. ప్ర‌జ‌ల బాధ‌లు విన‌కుండా ఈయ‌న ప్ర‌జ‌ల ద‌గ్గరికి వ‌చ్చి త‌న బాధ‌లు చెప్పుకుంటున్నారు. ద‌య‌చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌న్నీ పుస్త‌కంలో రాసుకోండి. అంతేకానీ మిమ్మ‌ల్ని ఎవ‌రెవ‌రు ఎన్ని తిట్టార‌ని కాదు” అని గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు ప్రియాంక‌.