Donald Trump: ఆ రోజు మోదీ నాకొదిలేయ్ నేను చూసుకుంటా అన్నారు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మోదీ చాలా మంచి వ్యక్తని.. తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఈ సందర్భంగా తాను మోదీతో జరిపిన సంభాషణ గురించి మీడియాతో పంచుకున్నారు. “” ఓసారి పాకిస్థాన్ భారత్‌పై బెదిరింపులకు పాల్పడుతోంది. నేను అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మోదీకి ఫోన్ కలిపా. పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది ఏమన్నా సాయం కావాలంటే నేనున్నా అని చెప్పా. దానికి మోదీ ఇచ్చిన సమాధానం విని నేను సర్‌ప్రైజ్ అయ్యా. మీ సాయానికి నేను మెచ్చాను. కానీ ఈ బెదిరింపులు ఇండియాకి కొత్తేం కాదు. వందేళ్ల నుంచి ఎదుర్కొంటున్నాం. దీనిని నేనే చూసుకుంటా నాకొదిలేయండి అన్నారు. అప్పుడు ఆయన మాటల్లోని ధైర్యం నాకెంతో నచ్చింది. మోదీ భారత్‌కు ప్రధాని కాకముందు వరకు న్యాయకత్వం అస్తవ్యస్తంగా ఉండేది. కానీ మోదీ స్ట్రాంగ్ లీడర్ “” అని ట్రంప్ వెల్లడించారు.
2020లో ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు నరేంద్ర మోదీ భారీ ర్యాలీ ఏర్పాటుచేసారు. ఈ ర్యాలీలో లక్ష మందికిపైగా జనాలు పాల్గొన్నారు. ఇలా ఏ అమెరికా అధ్యక్షుడి ర్యాలీకి కూడా ఇంత మంది హాజరుకాలేదు. ఇటీవల క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మోదీని కలవాలనుకున్నారు. మీటింగ్ కూడా షెడ్యూల్ చేసారు. కానీ త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు కలవడం రాజకీయంగా అంత మంచిది కాదు అని మోదీ భావించి ట్రంప్‌ని కలవకుండానే ఇండియా వచ్చేసారు.