Jagan: అంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా? జగన్ ట్వీట్ వెనుక అంతరార్థం ఏంటి?
Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు? ఎందుకు తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాల గురించి బయట పెడితే దానికి సమాధానం చెప్పకుండా మాటిమాటికీ ఈవీఎంల గురించి ప్రస్తావిస్తున్నారు?
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. పార్టీ ఓడిపోవడంతో జగన్ బాధతో మీడియా ముందుకు వచ్చి నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వా తాతల ఓట్లు ఏమైపోయాయో అని ఆవేదన చెందారు. మోసం జరిగిందని తెలుసు కానీ నిరూపించేందుకు ఆధారాలు లేవు అనే వ్యాఖ్యను కూడా చేసారు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది మళ్లీ ఐదేళ్లలో ఎన్నికలు వస్తాయి.. అప్పుడైనా గెలుద్దాం అనే ధీమాతో ఎప్పుడూ కలవని పార్టీ నేతలతో ఇప్పుడు రోజూ భేటీ అవుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ రెండు రోజులుగా రుషికొండపై కడుతున్న భవనాల విషయాలు భవనాల లోపలి ఫోటోలు బయటికి రావడంతో జగన్ బండారం బయటపడింది. జగన్ తన కోసం తాను నిర్మించుకుంటున్న భవనాలు అని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదేమీ కాదు వాటిని వీఐపిలు వస్తే గెస్ట్ హౌస్‌ల లాగా కట్టించాలనుకున్నాం అంటున్నారు.
అయితే ఈ రుషికొండపై భవనాల గురించి జగన్ ట్వీట్ చేస్తారని అనుకుంటే.. మళ్లీ ఈవీఎంలు మోసం అంటూ మొదటికే వచ్చారు. “” ఎలాగైతే న్యాయం చేయబడినట్లు మాత్రమే కాకుండా న్యాయం చేసినట్లు కూడా కనిపించాలో, అలాగే ప్రజాస్వామ్యం ఉనికి ఉందని కూడా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలలో కాగితపు బ్యాలెట్లు ఉపయోగిస్తారు, EVMలను కాదు. మనం కూడా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అదే వైపు ముందుకు సాగాలి “” అని ట్వీట్ చేసారు.
అంటే జగన్ ఈ ట్వీట్ ద్వారా ఏం చెప్పదలచుకున్నారు? ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లు పెట్టి ఓట్లు వేయిస్తే తప్పకుండా మరోసారి తాము గెలిచేవాళ్లం అనా? ఈవీఎంలలో మోసం జరిగినందు వల్లే తాము ఓడిపోయాం కాబట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారా?