Cine Politics: ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

AP: సినీ స్టార్స్ ఒక లెవ‌ల్ పాపులారిటీ తెచ్చుకున్నాక పొలిటిక‌ల్ (cine politics) ఎంట్రీ ఇస్తుంటారు. సినిమాల్లో ఆదిరించిన‌వారు రాజ‌కీయాల్లోనూ ఆద‌రించ‌క‌పోరా అన్న న‌మ్మ‌కంతో. అలా వ‌చ్చిన వారే సీనియ‌ర్ ఎన్టీఆర్ కూడా. అప్ప‌ట్లో ఆయ‌న‌కున్న క్రేజ్‌తో 1983లో TDP స్థాపించి ముఖ్య‌మంత్రి అయిపోయారు. ఆ త‌ర్వాత అంత‌టి రేంజ్ ఉన్న హీరో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారంటే అది మెగాస్టార్ చిరంజీవి. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ (praja rajyam party) పెట్టి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవిపై అభిమానంతో చాలా మంది ఎన్నో ర‌కాలుగా ప్ర‌చారాలు చేసారు కానీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న ఓడిపోయారు. రాజ‌కీయాలంటేనే కుళ్లు కుతంత్రాలు అని మొద‌టి ద‌శ‌లోనే అర్థం చేసుకున్న చిరు.. ఇక ఈ రోత‌లో ఉండ‌టం ఇష్టంలేక అభిమానులకు హీరోగానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆ త‌ర్వాత 2019లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నసేన (janasena) పార్టీని స్థాపించారు. అన్న‌య్య ఏమీ చేయ‌లేక‌పోయారు ఇక త‌మ్ముడు ఏం చేస్తాడు అనుకున్నారంతా. కానీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్లో లేక స‌రిగ్గా ప్ర‌చారం చేయ‌లేక‌పోవ‌డం వ‌ల‌నో 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన దారుణంగా ఓటమి పాలైంది. కాబ‌ట్టి ఈసారి ఎలాగైనా YCP ప్ర‌భుత్వాన్ని అధికారం నుంచి దించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు ప‌వ‌న్. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసింది ఏమీ లేదు అంటూ త‌న నినాదాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసారు. ఇందుకోసం TDP పార్టీతో పొత్తు కూడా పెట్టుకోవ‌డానికి సిద్ధప‌డ్డారు ప‌వ‌న్. అయితే ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాల్లో ఇత‌ర టాప్ హీరోల గురించి ప్ర‌స్తావిస్తున్నారు.

ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్ బాబు.. ఇలా టాప్ హీరోల ఫ్యాన్స్ అంతా క‌లిసి త‌న‌కు ఓటు వేయాల‌ని అంటున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సినీ ఇండ‌స్ట్రీ నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన సీనియ‌ర్ ఎన్టీఆర్ కానీ చిరంజీవి కానీ ఇలాంటి టెక్నిక్స్ వాడింది లేదు. అంటే రాజ‌కీయ ప్ర‌చారాల్లో సినిమా టాపిక్స్ ఎప్పుడూ తీసుకురాలేదు. 2019లో పార్టీ పెట్టిన‌ప్పుడు ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ ఇలా ఇత‌ర హీరోల గురించి ప్ర‌స్తావించ‌లేదు. కానీ ఇప్పుడు సినిమాలు, హీరోల గురించి ప్ర‌స్తావిస్తూనే ప్ర‌చారాల్లో పాల్గొంటున్నారు. మ‌రి ఈ టెక్నిక్ ఈ సారి వ‌ర్కవుట్ అవుతుందా? నిజంగానే ఇత‌ర హీరోల అభిమానులు అంతా కలిసి ప‌వ‌న్‌కు ఓటేస్తే జ‌న‌సేన గెలిచే అవ‌కాశం ఉందా? అన్న విష‌యం మ‌రి కొన్ని నెల‌ల్లో తెలిసిపోతుంది.