dmk files: అన్నామలైకి నోటీసులు.. 500 కోట్లు పరువునష్టం దావా!
chennai: తమిళనాడు డీఎంకే అధినాయకుడు, సీఎం స్టాలిన్ అన్నంత పని చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (tamil nadu bjp chief annamalai)కి లీగల్ నోటీసులు పంపింది.. డీఎంకే(dmk) పార్టీపై అన్నామలై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గాను.. లీగల్ నోటీసులు జారీ చేయడంతోపాటు.. 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. దీనిపై అన్నామలై స్పందించాల్సి ఉంది. డీఎంకే ఫైల్స్ వివాదం గత రెండు మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో వాడీవేడిగా కొనసాగుతోంది. 2006 నుంచి 2011 వరకు అప్పట్లో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు పనుల్లో అవినీతికి పాల్పడినట్లు అన్నామలై ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై డీఎంకే ప్రభుత్వం స్పందించింది. పరువు నష్టం దావా వేయడంతోపాటు… లీగల్ నోటీసులను అన్నామలైకి జారీ చేశారు.
చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టును అప్పటి డీఎంకే ప్రభుత్వం తనకు సంబంధించిన సంస్థకు ఆ టెండర్‌ను కట్టబెట్టి.. దాదాపు రూ.200 కోట్ల మేరకు ముడుపులను ఎన్నికల కోసం తీసుకుందని అన్నామలై ఆరోపణలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో డీఎంకే ఎంపీలు, మంత్రుల ఆస్తులు, అక్రమార్జనల వివరాలను ఆయన విడుదల చేశారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు చేపట్టిన సమయంలో ఆ ప్రాజెక్టు కోసం జికా సంస్థ 59 శాతం, కేంద్ర ప్రభుత్వం 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 21 శాతం మేరకు నిధులు కేటాయించాయని, ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.14 వేల కోట్లుగా నిర్ణయించారని, ఆ తర్వాత ఎన్నికలు జరిగేందుకు ఆరు నెలల వ్యవధి ఉన్న సమయంలో అత్యవసరంగా టెండర్లు రూపొందించారని చెప్పారు. ఆ కాంట్రాక్టను ఆల్‌స్టామ్ అనే సంస్థకు ఉద్దేశపూర్వకంగా కట్టబెట్టారని అన్నామలై ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆల్‌స్టామ్ సంస్థ ముఖ్యమంత్రి స్టాలిన్(cm stalin)కు రూ.200 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 2011 ఎన్నికల విరాళం రూపంలో రూ.200 కోట్ల ముడుపులు స్టాలిన్ పొందారన్నారు.