Phone Tapping Case: ఇజ్రాయెల్ నుంచి ప‌రిక‌రాన్ని తెప్పించిన KCR?

Phone Tapping Case: తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచ‌ల‌నం సృష్టించింది. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోన్‌ను ట్యాప్ చేయించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అడిష‌న‌ల్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీసులు అయిన‌ భుజంగ రావు, తిరుప‌తన్న‌ల‌ను పోలీసుల ఎదుట అప్రూవ‌ర్‌గా మారారు. అన‌ధికారికంగా ఫోన్ ట్యాప్ చేసిన మాట నిజ‌మేన‌ని వెల్ల‌డించారు.

భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెక్నిక‌ల్ క‌న్‌స‌ల్టెంట్‌గా ప‌నిచేస్తున్న ర‌వి అనే వ్య‌క్తి సాయంతో ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాన్ని తెప్పించార‌ట‌. సాధారంగా ఇలాంటి ప‌రిక‌రాలు దిగుమ‌తి చేయాలంటే క‌చ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవేమీ ఫాలో అవ్వ‌కుండా KCR ప్ర‌భుత్వం ఆ ప‌రిక‌రాన్ని తెలంగాణ‌కు తెప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌త్యేక‌మైన ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాన్ని ఎక్క‌డ ఉంచినా దాదాపు 300 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ఫోన్ ట్యాప్ చేయ‌గ‌ల‌ద‌ట‌.

ఈ ప‌రిక‌రాన్ని రేవంత్ రెడ్డి నివాసం వ‌ద్ద ఉంచిన‌ట్లు పోలీసుల అదుపులో ఉన్న అధికారులు వెల్ల‌డించారు. సాక్ష్యాలు ల‌భించ‌కుండా ప‌రిక‌రాల‌ను, ఫోన్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఒప్పుకున్నారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ నాయ‌కుల‌నే కాదు.. ఇత‌ర బ‌డా వ్యాపార‌వేత్త‌ల నివాసాల వ‌ద్ద కూడా ఈ ప‌రిక‌రాన్ని అమ‌ర్చార‌ట‌. ప‌లువురు బ‌డా వ్యాపార‌వేత్త‌ల మాట‌ల‌ను విని వారిని బెదిరించి పార్టీకి ఫండింగ్ ఇప్పించుకున్న‌ట్లు కూడా వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇదే ఫోన్ ట్యాపింగ్ వ‌ల్ల ప‌లువురు సెల‌బ్రిటీ జంట‌లు విడాకులు కూడా తీసుకున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గా.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌, వ్యాపార‌వేత్త అయిన శ‌ర‌ణ్ చౌద‌రి అనే వ్య‌క్తి రేవంత్ రెడ్డికి భార‌త రాష్ట్ర స‌మితిపై ఫిర్యాదు చేసాడ‌ట‌. ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌ను కిడ్నాప్ చేయించి బ‌ల‌వంతంగా ఓ స్థ‌లాన్ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పేరు మీద రాయించుకున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.