JDS- దేవగౌడకు ఇంటి పోరు.. అన్నదమ్ముల వైరం!
Bengaluru: కర్నాటకలో ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్(jds)లో ముసలం రాచుకుంది. అయితే ఇది పార్టీ కేడర్‌లో కాదు. జేడీఎస్ వ్యవస్థాపకులు మాజీ ప్రధాని దేవగౌడ(devagowda) కుటుంబ సభ్యుల మధ్యే వివాదం నెలకొంది. దీనిపై గత కొన్ని రోజులుగా కర్నాటకలో చర్చ జరుగుతోంది. దేవగౌడకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దకుమారుడి పేరు రేవణ్న(revanna), చిన్నకుమారుడి పేరు కుమారస్వామి(kumara swamy). దేవగౌడ సొంత జిల్లా హసన్(hasan district). ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాల్లో జేడీఎస్ బలంగా ఉంది. ఈక్రమంలో హసన్ నియోజకవర్గం టికెట్టు విషయంలో కుటుంబంలో గొడవ మొదలైంది. ఈ సీటును తన భార్య భవాని(bhavani revanna)కి కేటాయించాలని రేవణ్న పట్టుబడుతుండటా.. కుమారస్వామి మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. దీంతో ఈ పంచాయతీ కాస్త దేవగౌడ వద్దకు చేరగా.. ఆయన ఇద్దరు కుమారులను, కోడలని పిలిపించి మాట్లాడారు. కానీ ఫలితం లేకపోయింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి.. తన అన్నను వెనుక నుంచి ఎవరో రెచ్చగొడుతున్నారని.. హసన్ టిక్కెట్ కోసం అందుకే పట్టుబడుతున్నారని అన్నారు. ఏడాది కిందటి నుంచే హసన్ టిక్కెట్టును పార్టీ కోసం పనిచేస్తున్న హెచ్‌పి స్వరూప్(swaroop)కు ఇస్తానని చెబుతూ వచ్చానని.. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.
కుమారస్వామి మాటలపై ఆయన అన్న మాజీ మంత్రి రేవణ్న స్పందించారు. తాను ఎవరి డైరెక్షన్లో లేనని.. తన తండ్రి మాటే శిరోధార్యం అని చెప్పుకొచ్చారు. అయితే తన భార్యకు టిక్కెట్టు ఇచ్చే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఈ లోపే మీడియాలో అనేక అవాస్తవాలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక రేవణ్న, మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు సిద్దారామయ్య(siddha ramayya) మంచి స్నేహితులు. ఇతని ప్రోత్సాహంతోనే హసన్ టికెట్టు తన భార్యకు ఇవ్వాలని రేవణ్న పట్టుబడుతున్నారని కుమారస్వామి పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.