Dastagiri: చంద్రబాబుని అరెస్ట్ చేసి.. వివేకా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
Dastagiri: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేసారు. 2023 అక్టోబర్ 31న ఓ కేసులో భాగంగా తనను అన్యాయంగా ఇరికించి కడప సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న దేవినేని శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి తనను కడప జైల్లో బెదిరించాడని ఆరోపణలు చేసారు. ఇదే విషయాన్ని అప్పటి జైలు అధికారి అయిన సిద్ధార్థ్ కౌశల్‌కు విన్నవించుకుంటే ఆయన కనీసం పట్టించుకోలేదని అన్నారు.
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడిచింది కాబట్టి వివేకానంద హత్య కేసు నిందితులకు శిక్ష పడలేదని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని పూస గుచ్చినట్లు వివరించి తీరతానని దస్తగిరి మీడియా ద్వారా వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చైతన్య రెడ్డి, వైఎస్ భారతి, అవినాష్ రెడ్డిలపై తాను ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తప్పు చేసాడని జైల్లో పెట్టించినప్పుడు.. వైఎస్ వివేకాను తాము చంపకపోయి ఉంటే ఎందుకు నిందితులను పట్టించి అదే మాదిరిగా జైల్లో పెట్టించలేదని ప్రశ్నించారు. చంపింది జగన్ అండ్ కో కాబట్టే వ్యవస్థలను మేనేజ్ చేసి ఇన్నాళ్లూ తప్పించుకుని తిరిగారని అన్నారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడి తీరాల్సిందేనని.. తన తప్పు ఉంటే తనకు కూడా శిక్ష వేయాలని దస్తగిరి అన్నారు.
ఓసారి అవినాష్ రెడ్డి తన వద్దకు వచ్చి పిట్ట కథ చెప్పాలని అన్నట్లు పేర్కొన్నారు. ఎందుకు అప్రూవర్‌గా మారాల్సి వచ్చింది అని ఎవరైనా అడిగితే… తన భార్యకు మతిస్థిమితం లేదని.. ఆమె కోసం ఎలాగైనా జైలు నుంచి బయటికి వచ్చేందుకు అప్రూవర్‌గా మారాల్సి వచ్చిందే తప్ప జగన్ అండ్ కో నేరం చేసారని మాత్రం కాదు అని చెప్పాలని బెదిరించారని అన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోతే తనను వారం రోజుల పాటు 24 గంటలూ ఓ గదిలో బందించారని తెలిపారు. ఎందుకిలా బందించారు అని అడిగితే.. జగన్ నుంచి ఆర్డర్స్ రావడం వల్లే బందించాల్సి వచ్చినట్లు తనతో సిద్ధార్థ్ కౌశల్ చెప్పారని మీడియా ముఖంగా బయటపెట్టారు. ఇకనైనా వివేకా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చి అసలైన నిందితులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.