Daggubati Purandeswari: ఏపీ BJP చీఫ్‌ పోస్ట్‌కు గుడ్‌బై?

Daggubati Purandeswari to get replaced as bjp ap chief

Daggubati Purandeswari: భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ చీఫ్ ప‌ద‌వికి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. గుడ్ బై చెప్ప‌నున్నారు అన‌డం కంటే తీసి ప‌క్క‌న‌పెట్ట‌నున్నారు అనే ప‌దం స‌రిపోతుంది. ఎందుకంటే కొంత‌కాలంగా పురంధేశ్వ‌రి ఎలాంటి స‌మావేశాల్లోనూ పాల్గొన‌డం లేదు. పైగా ఆమె నేతృత్వం ప‌ట్ల చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఈ మేర‌కు హైక‌మాండ్‌కు పురంధేశ్వ‌రిపై చాలా ఫిర్యాదులు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఏపీకి కొత్త BJP చీఫ్‌ని నియ‌మించాల‌ని హై క‌మాండ్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా ఒక రాష్ట్రానికి పార్టీ చీఫ్ ప‌ద‌విని మూడేళ్ల పాటు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత వారి ప‌ని తీరు న‌చ్చితే ప‌ద‌వి పెంచుతారు కూడా. పురంధేశ్వ‌రి కంటే ముందు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ ప‌ద‌విలో ఉన్నారు. సోము వీర్రాజు మూడేళ్ల పాటు ఈ ప‌ద‌వి చేప‌ట్టారు. ఆయ‌న కంటే ముందు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌న్న రెండున్న‌రేళ్లు ఈ ప‌ద‌విని చేప‌ట్టారు. ఆమె ద‌గ్గ‌రుండి తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు కూట‌మితో చేతులు క‌లిపేలా చేసింది కాబ‌ట్టి రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి ఇచ్చారే త‌ప్ప లేక‌పోతే అది కూడా డౌటే.

పైగా పురంధేశ్వ‌రి రాష్ట్రానికి బీజేపీ చీఫ్‌గా ఉన్నంత‌వ‌ర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎద‌గ‌నివ్వ‌డు అనే ఫిర్యాదులు హైక‌మాండ్‌కు వెళ్లాయి. గ‌తంలో పార్టీ చీఫ్‌లుగా క‌మ్మ‌, కాపు వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌కు వెళ్లింది కాబ‌ట్టి ఇప్పుడు రెడ్డి లేదా ఓబీసీ వ‌ర్గాల‌కు చెందిన నేత‌ను చీఫ్‌గా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. బీసీ నేత అయిన వై స‌త్య కుమార్ పేరు ప్ర‌స్తుతానికి ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.