కొడాలి నానికి అరెస్టు వారెంట్‌ జారీ.. YCPకి బిగ్‌ షాక్‌!

టీడీపీ ప్రభుత్వంపై అదేవిధంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిత్యం నిప్పులు చెరుగుతూ ఉంటారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు నుంచి ఆ పార్టీలో ఎవరు విమర్శలు చేసినా కొడాలి నాని ఘాటుగా స్పందిస్తుంటారు. అయితే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. 2016లో పోలీసుల అనుమతి లేకుండా ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ర్యాలీ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని అప్పట్లో కేసు నమోదైంది. దీనిని నాని సీరియస్‌గా తీసుకోలేదు. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందులను కొనితెచ్చింది. చట్టానికి నాని సహకరించనందున అతనికి అరెస్టు వారంటీ జారీ చేయాలని విజయవాడ గవర్నర్‌పేట కోర్టు స్థానిక సీఐకి ఆదేశాలు జారీ చేసింది.

నానిపై కోర్టు ఆగ్రహం..
ఎమ్మెల్యే కొడాలి నానిపై ఈ ఏడాది జనవరి 5న అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే ఇది పెండింగ్‌లోనే ఉంది. పలు వాయిదాలకు నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి గవర్నర్‎పేట సీఐ సురేష్ కుమార్‎ ఇవాళ కోర్టుకు రాగా.. న్యాయమూర్తి అతన్ని పలు ప్రశ్నలు వేశారు. నాని వాయిదాలకు రాకపోయినా.. ఎందుకు పట్టించుకోలేదని జడ్జి ప్రశ్నించింది. వెంటనే అరెస్టు వారెంటు జారీ చేయాలని సీఐని జస్టిస్ గాయత్రీదేవి ఆదేశించారు.

అప్పుడు ఏం జరిగిందంటే..
2016 మే 10న అప్పడు అధికారంలో ఉన్న టీడీపీ… రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రయత్నించడం లేదని ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మరి కొందరు కలిసి విజయవాడలో ర్యాలీ చేశారు. ఈక్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని.. వారిపై కేసు నమోదైంది. అయితే వాయిదాలకు నాని రాకపోవడంపై కోర్టు సీరియస్‌ అయ్యింది. వెంటనే అరెస్టు వారెంటు జారీ చేయాలని పోలీసులకు సూచించింది. మరి ఇప్పుడైనా వాయిదాలకు రాకపోవడానికి కారణాలు చెబుతారా… లేదా కొడాలి నాని అరెస్టు అవుతారా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చెయ్యాల్సిందే.