రేవంత్ జైలుకెళ్లినా జైలు నుంచే రాష్ట్రాన్ని పాలిస్తాడు
Jithender Reddy: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకెళ్లినా జైలు నుంచే పాలన కొనసాగిస్తానడని అన్నారు కాంగ్రెస్ ఎంపీ జితేందర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
చంద్రబాబు నాయుడు పేరును చార్జ్ షీట్‌లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ తరఫు న్యాయవాది అప్పట్లో సుప్రీంకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను ధర్మాసనం జులై 24కి వాయిదా వేసింది. అయితే ఒకవేళ ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా తేలితే ఆయన జైలుకెళ్లాల్సిందే. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు చేపడతారు అని జితేందర్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన జైల్లో ఉన్నా పాలన కొనసాగిస్తాడని చెప్పడం గమనార్హం.