CM Jagan: న‌ర‌కాసురుడినైనా నమ్మండి.. కానీ చంద్రబాబుని నమ్మద్దు

Amaravathi: నరకాసుడినైన నమ్మండి.. కానీ చంద్రబాబుని నమ్మద్దు అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ (cm jagan). అమరావతిలో 50,793 మంది పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు వెంకటపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభ నుంచి సీఎం జగన్‌ (cm jagan) ప్రసంగించారు.  “పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. నా పేద అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం.. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుంది. దేశ చరిత్రలో ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజ‌యం”

ఒక వైపు పేదవాడు, మరో వైపు పెత్తందార్లు ఉన్నారని, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే పెత్తందార్లు ఏకంగా కోర్టుల దాకా వెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టులో ఓడిపోయిన తరువాత కూడా నిన్న కూడా చంద్రబాబు రకరకాల పద్ధతిలో అడ్డుకుంటున్నారని, నరకాసుడినైన నమ్మండి.. కానీ ఆ చంద్రబాబుని నమ్మవద్దని ఎద్దేవాచేసారు. పేదవాడు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదవాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేరుగా నేను బటన్‌ నొక్కితే ఆ డబ్బులు మీ ఖాతాల్లోకే వెళ్తున్నాయి, దీంతో మీ పిల్లలను హాయిగా చదివించుకుంటున్నారు.. ఇలాంటివి చేస్తుంటే.. దాన్ని కూడా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అవుతుందని వార్తలు రాస్తున్నారని, చర్చలు పెడుతున్నారని మండిపడ్డారు.